calender_icon.png 12 October, 2025 | 3:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజర్వేషన్ల సాధనలో లోపమెక్కడ?

12-10-2025 12:00:00 AM

తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి జీవో నెంబర్ 9ని విడుదల చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు సెప్టెంబర్ 29 న షెడ్యూల్ విడుదల చేసిం ది. కానీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 9లో రిజర్వేషన్ల పరిమితి 50 శాతం దాటిందని ఇది చట్టానికి వ్యతిరేకమని, గతంలో కోర్టులు ఇచ్చిన తీర్పులకు లోబడి లేదని జీవోకి వ్యతిరేకంగా రెడ్డి జాగృతి సంస్థకి చెందిన బి.మాధవరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకో ర్టు అక్టోబర్ 8, 9వ తేదీల్లో విచారణ చేపట్టి జీవో నెంబర్ 9 పైన స్టే విధించింది.

దీంతో రాష్ర్టంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. అంతేకాదు 42 శాతం రిజర్వేషన్లు సాధించలేకపోవటంతో బీసీ వర్గాలు అసంతృ ప్తికి లోనయ్యాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనపైన పిటీషన్ దారుల త రఫు నుంచి, రిజర్వేషన్లు ఎందుకు పెం చాల్సి వచ్చిందో ప్రభుత్వం తరఫు నుంచి గౌరవ ధర్మసనంలో బలమైన వాదనలు జరిగాయి.

కానీ జీవోపై స్టే విధిస్తూ కౌం టర్ దాఖలు చేయాలని పిటిషన్‌దారుల కు రెండు వారాలు, ప్రభుత్వానికి నాలుగు వారాల గడువు  హైకోర్టు ఇచ్చిన నేపథ్యం లో రిజర్వేషన్ల సాధనలో ఎక్కడ లోపం జ రిగిందనేది అవగతం చేసుకోవాల్సిన పరిస్థితి. రిజర్వేషన్ల సాధనకు ప్రభుత్వం అ నుసరిస్తున్న మార్గం సరైనదేనా? భవిష్యత్తులోనైనా రిజర్వేషన్లు సాధించగలు గు తామా? అనే అంశంపై రాష్ర్టవ్యాప్తంగా చర్చ జరుగుతుంది.

ప్రభుత్వం వాదనలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ప్రభు త్వం చేస్తున్న ప్రయత్నాలను, కృషిని తప్పు పట్టలేం కానీ ప్రభుత్వ ప్రయత్నాల్లో లోపా లు ఉండటం వల్ల రిజర్వేషన్ల సాధనలో ప్రభుత్వం అడుగులు ముందుకు పడటం లేదు. 2018లో నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు ఉన్న 34 శాతం రిజర్వేషన్లను కాపాడలేకపోగా బీసీల రిజర్వేషన్లు 23 శాతానికి తగ్గటానికి కారణ మైంది.

కానీ మేము అలా కాదు రిజర్వేషన్ల పెంపుకి ఉన్న అన్ని మార్గాలను ఉప యోగిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నది. కులగణన చేసి బీసీల లెక్కలు తేల్చాం, బీసీల రాజకీయ వెనుకబాటుతనాన్ని తేల్చటానికి డెడికేటెడ్ కమీషన్ నియమించి ఆ కమీషన్ సిఫారసుల మేరకే స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి బిల్లు రూపొందించి శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదింపజేసి రా ష్ర్టపతికి పంపామని ప్రభుత్వం పేర్కొం ది.

తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టంలోని 285 (ఏ) సెక్షన్ కి సవరణలు ప్రతిపాదించి గవర్నర్‌కి పంపామని, జీవో నెంబర్ 9 తీసుకువచ్చి 42 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించింది. జీవో నెంబర్ 9పై హైకోర్టులో విచారణ సందర్భంగా అభిషేక్ సిం గ్వి మనూ, అడ్వకేట్ జనరల్‌లు ప్రభుత్వం తరఫున వాదిస్తూ ఇందిరా సహానీ కేసులో రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి కేవలం విద్యా, ఉద్యోగాలకు మాత్రమే వర్తిస్తుంది కానీ స్థానిక సంస్థలకు వర్తించదు అనే అం శాన్ని తెరపైకి తెస్తూ 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుని శాసనసభలో అన్ని పా ర్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయి.

కాబట్టి దీనినే ప్రజాభిప్రాయంగా పరిగణించి 42 శాతం రిజర్వేషన్ల అమలుకు అనుమతి ఇ వ్వాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. కానీ ప్రజాభిప్రాయం చట్ట రూపంలోకి మారాలనే విషయాన్ని గమనించాల్సి ఉంది. అలాగే రాష్ర్టపతి, గవర్నర్ దగ్గర ఉన్న బి ల్లులపై వారు నిర్ణయం తీసుకోకపోవటా న్ని కూడా ఆమోదంగా భావించాలని ప్ర భుత్వం తరఫున వాదించిన కౌన్సిల్ ధర్మసనానికి విజ్ఞప్తి చేసింది. కానీ పిటిషన్ దా రుల అభ్యంతరాలు బిల్లులపైన కాదు జీ వో పైన అనే విషయాన్ని ధర్మాసనం పరిగణలోకి తీసుకొని ఉండవచ్చు. 

ప్రయత్నాలు విఫలం

ప్రభుత్వం ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఎందుకు 42 శాతం రిజర్వేషన్లు సాధించలేకపోయిందని సామాన్య ప్రజలను, బల హీన వర్గాలను వేధిస్తున్న ప్రశ్న. లోపం ఎక్కడ జరుగుతుంది, తప్పు ఎవరిది, రాజకీయాలు ఎవరు చేస్తున్నారు, ఎవరు ఎవ రిని మోసం చేయటానికి ప్రయత్నిస్తున్నా రో అర్థం కాని పరిస్థితుల్లోకి బలహీన వర్గాలను నెట్టివేశారు.

మొదటి లోపం ఏంటం టే ప్రభుత్వం రూపొందించిన బిల్లులో స్ప ష్టత లేదు, రిజర్వేషన్లు సాధించటానికి కా వాల్సినంత బలం లేదు. బిల్లులో ఎస్సీ, ఎ స్టీ రిజర్వేషన్ల పరిమితిని 27 శాతం నుంచి 25 శాతానికి తగ్గించారు. అదే బీసీ రిజర్వేషన్లను 23 శాతం నుంచి 42 శాతానికి ఎం దుకు పెంచుతున్నామనే బలమైన కారణం చూపించలేదు. బిల్లులో తమిళనాడు తరహాలో రిజర్వేషన్ల పెంపుకి సహేతుకమైన, ప్రామాణికమైన కారణాలను చూపించలేదు. బీసీల రాజకీయ వెనుకబాటుతనాన్ని బీసీ రిజర్వేషన్లను వర్గీకరిస్తూ ఎ వరికీ ఎంత వాటానో స్పష్టం చేయలేదు.

రెండోదిగా తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టంలోని రిజర్వేషన్ల పరిమితిని 50 శా తానికి పరిమితం చేసే 285 (ఏ) సెక్షన్ స వరణ కేవలం తెలంగాణకి మాత్రమే వర్తించదు కాబట్టి ఆ సవరణకు గవర్నర్ అ నుమతి లభ్యం కాలేదు. మూడోది జీవో నెంబర్ 9లో ట్రిపుల్ టెస్ట్‌ని అనుసరించి రిజర్వేషన్ల పరిమితిని నిర్ణయించలేదు. కా బట్టి బిల్లు రాష్ర్టపతి వద్ద పెండింగ్, సవరణ బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్, జీవో కోర్టు కేసుల్లో చిక్కుకుపోవటం వల్ల రిజర్వేషన్ల సాధనకి ప్రభుత్వం చేసిన ప్రయత్నా లు సఫలీకృతం కాలేదు. 

యాభై శాతం తొలగిస్తేనే

కులగణన చేసి డెడికేటెడ్ కమిషన్ సి ఫారసుల మేరకే రిజర్వేషన్లు పెంచినంత మాత్రాన రిజర్వేషన్లని 50 శాతానికి మిం చి ఇవ్వటం సాధ్యం కాదు. రిజర్వేషన్ల పరిమితి 50 శాతం మించరాదని 1994 స్థాని క సంస్థల రిజర్వేషన్ల చట్టం, 2010 సుప్రీం కోర్టు ట్రిపుల్ టెస్ట్ తీర్పు, 2018 తెలంగా ణ హైకోర్టు తీర్పు, 2021 వికాస్ రావు గ వాలి కేసులో తీర్పు, 2022 సురేష్ మహాజన్ కేసులో తీర్పులు పేర్కొంటున్నాయి.

ఇక కాంగ్రెస్ పార్టీ 2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ‘న్యాయ్ పాత్ర’ మేనిఫెస్టోలో చెప్పినట్లు 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని తొలగించాలి. అప్పుడే రిజర్వేషన్ల పెంపుకి ఉన్న ప్రధాన అడ్డంకి తొ లగిపోతుంది. రాహుల్ ప్రధాని అయితే 24 గంటల్లో 42 శాతం రిజర్వేషన్లు సాధిస్తానని రేవంత్ రెడ్డి చెప్పినట్లుగానే బీసీ రి జర్వేషన్లు సాధించటానికి పార్లమెంటరీ ప్ర క్రియ ద్వారా కేంద్రం సహకారంతో, లేదా అఖిలపక్షం ద్వారా కేంద్రంపై ఒత్తిడి చేస్తూ జయలలిత సాధించిన విధంగానే రాష్ర్ట ప్ర భుత్వం రిజర్వేషన్లు సాధించాలి.

బీసీల్లో అ త్యంత వెనుకబడిన కులాలు, సంచార జా తులకి రాజకీయ ప్రాధాన్యత దక్కని అం శాన్ని డెడికేటెడ్ కమిషన్ ద్వారా బయటపెడుతూ ఇప్పటివరకు ప్రాతిని ధ్యం ద క్కని కులాలకు రిజర్వేషన్లు అందే విధంగా వాటిని వర్గీకరించి రిజర్వేషన్ల పెం పుకి మార్గం సుగమం చేయాలి. ప్రస్తుతం రిజర్వేషన్ల సాధనకు ఎదురవుతున్న అ డ్డంకులను అధిగమించడానికి రాజ్యాంగ, న్యాయ నిపుణులతో  ఒక ఎక్స్ పర్ట్ కమిటీ వేసి ఆ కమిటీ సహకారంతో రిజర్వేషన్లు సాధించటానికి రాష్ర్ట ప్రభుత్వం ప్రయ త్నం చేయాలి. 

రాజకీయ కోణంలో కాకుండా.. 

హైకోర్టు, సుప్రీంకోర్టు ద్వారా రిజర్వేషన్లు సాధించే మార్గాలు చాలా పరిమితం కాబట్టి పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా చట్టబద్ధంగా తమిళనాడు ప్రభుత్వ అనుభవం ప్రాతిపదికగా రిజర్వేషన్లు సాధించే ప్రయత్నాలు చేస్తే మంచిది. కేంద్ర ప్రభుత్వం కూ డా రిజర్వేషన్లను రాజకీయ కోణంలో కా కుండా ఇప్పటివరకు రిజర్వేషన్ల పరంగా బీసీలకు జరిగిన అన్యాయ ప్రాతిపదికగానే చూడాలి.

రాజకీయంగా స్థానిక సంస్థల్లో అవకాశాలు దక్కని కులాల పక్షాన కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఎస్సీ వర్గీకరణకి, మహిళా బిల్లుకి, ఈడబ్ల్యూఎస్ రి జర్వేషన్ల సాధనకి కేంద్ర ప్రభుత్వం ఎలా సహకరించిందో బీసీ రిజర్వేషన్ల సాధనకు కూడా అలాగే సహకరించాలని ఆశిద్దాం!

 వ్యాసకర్త సెల్: 9885465877