13-10-2025 12:03:03 AM
నేను రాతిరంతా పుస్తకాలతో మాట్లాడుతుంటే
లోకం చీకటి వెలుతురులన్నీ
నాతో లోకాన్ని విప్పి చెబుతున్నవి
కొన్ని నా గుండెకు నిప్పు అంటిస్తుంటే
కొన్ని తుపాకీనీ నా చేతికిస్తున్నాయి
కొన్ని కన్నీళ్లను మనసు నుంచి దులుపుతున్నవి.
నీటిలో దూకిన సూర్యుడు బల్బులో దూరి
వెన్నెల వెలుతురు పోస్తుండు
చెట్ల ఆకులు ఫ్యాన్ రెక్కలలో చేరి నా పైకి
చల్లని గాలిని వీస్తున్నాయి
ఆకాశగంగా బిందెలో పడుకొని
గ్లాస్‌తో నా దాహం తీరుస్తుంది.
నా భార్య నా పక్కనే గురకతో శారీరక శ్రమను
వెళ్లగొడుతుంది
పట్నం చీకటి దుప్పటి లో దూరి
రేపటిని కలగంటుంది నిశ్శబ్దమై
సూర్యుడు ఎప్పుడో డ్యూటీ దిగి
ఇంటికెళ్లిపోయిండు
అమావాస్య చీకటి చంద్రునికి
సెలవు ప్రకటించింది.
ఆకాశంలో బాల కార్మికులు మాత్రమే
మిణుగురు మిణుగురు మంటూ చీకటులను
ఊడ్చేస్తున్నారు విరామం లేకుండా
మేఘాలు నేల స్వేదను మింగి చల్లగా
మత్తుగా నిద్రపోతున్నాయి
నా రక్తంలో ఏవో అలజడులు నన్ను నిద్రపోనిస్తలేవు!