23-09-2025 01:28:54 AM
-ఉప ఎన్నికల్లో ఫిరాయించిన ఎమ్మెల్యేల ఓటమి ఖాయం
-కాంగ్రెస్ దుర్మార్గం వల్లే కృష్ణా జలాల్లో అన్యాయం
-మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి) : ఫిరాయింపులకు కారణం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలేనని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ పుట్టకముందే ఫిరాయింపుల చట్టం వచ్చిందని గుర్తు చేశారు. ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, సంజయ్‌లతో కలిసి సోమవారం అసెంబ్లీ మీడియాలో ఆయన మాట్లాడారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలందరూ నియోజకవర్గ ప్రజలను ద్రోహంచేసి పార్టీ మారారని విమర్శించారు.
అన్ని ఆధారాలు సెక్రటరీకి సమర్పించామని, స్పీకర్ సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామని తెలిపారు. తాను ఏ పార్టీలో ఉన్నానో స్పీకర్ నిర్ణయిస్తారని కడియం శ్రీహరి మాట్లాడుతున్నారని, కొంచెం సోయి, జ్ఞానంతో మాట్లాడాలని సూచించారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావటం ఖాయం, పార్టీ మారిన ఎమ్మెల్యేలు మట్టి కరవటం ఖాయమని జోస్యం చెప్పారు. బండి సంజయ్ తిరిగే కార్లు ఏ షోరూంలో కొన్నారో, కేటీఆర్ అక్కడే కొన్నారని అన్నారు.
బండి సంజయ్‌వి చిల్లర మాటలని, సెకండ్ హ్యాండ్ కార్లు ఎవరైనా కొంటారని, వారు ఎక్కడ తెచ్చారో మాకెలా తెలుస్తుందన్నారు. బండి సంజయ్ హోమ్ మంత్రిగా ఉండి కనిపెట్టింది ఇదేనా, బండి సంజయ్ ఏమైనా వాస్కోడి గామానా లేక కొలంబసా అని ఎద్దేవా చేశారు. మంత్రి ఉత్తమ్‌కు బుర్ర లేదని, కాంగ్రెస్ దుర్మార్గం వల్లే కృష్ణా జలాల్లో అన్యాయం జరుగుతుందన్నారు. చర్చించటానికి డేట్ ఫిక్స్ చేయాలని, ఆధారాలతో వస్తామని, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి చెప్పు దెబ్బలకు సిద్ధమా అని సవాల్ విసిరారు.