17-12-2024 02:18:46 AM
* ప్రభుత్వ రంగ సంస్థలు ‘అదానీ’ పాలు
* బీడీఎల్ నేతలతో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం
హైదరాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాంతి): కేంద్రంలోని బీజేపీ సర్కార్ కార్పొరేట్ తొత్తుగా మారిందని, ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ గ్రూప్‌కు కట్టబెడుతున్నదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో సోమవారం భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల్లో గెలుపోటములను సమానంగా చూడాలని చెప్తుంటారని, పార్టీ శ్రేణులు ఏమాత్రం నిరాశ చెందొద్దని సూచించారు. బీఆర్‌ఎస్ హయాంలో సింగరేణి సంస్థకు గతంలో ఎన్నడూ లేని స్థాయిలో లాభాలు వచ్చాయని, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తోనే లాభాలు సాధ్యమయ్యాయని కొనియాడారు.
బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పాలని తాము డిమాండ్ చేస్తే, గనులన్నింటినీ కేంద్రం అదానీ కట్టబెడుతున్నదని ధ్వజమెత్తారు. ప్రమాదవశాత్తు రైతు మృతిచెందితే, ఆ కుటుంబానికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.5 లక్షల బీమా కల్పించిందన్నారు. ఈ పథకం దేశంలోనే అత్యుత్తమ పథకంగా నిలిచిందన్నారు. పథకంతో ఎల్‌ఐసీకీ మేలు జరిగిందన్నారు. సమావేశంలో శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి పాల్గొన్నారు.