26-07-2025 06:09:27 PM
- స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆదరించే పార్టీలకు అండగా ఉంటాం..
- విస్మరించే పార్టీలను బొంద పెడతాం.!
- బీసీ రిజర్వేషన్ అనంతరం వర్గీకరణ తప్పనిసరి చేయాలి.
- సగర సంగం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్..
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అంశంలో బీజేపీ పార్టీ కపట నాటకమాడుతోందని సగర సంగం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్(Sagara Sangam State President Uppari Shekhar) ఆరోపించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించిన రాజకీయ చైతన్య సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సుమారు 50 నుంచి 60 స్థానాల్లో సగర సంఘం నేతలు పోటీలో నిలుస్తున్నారని ఆ పార్టీ వ్యక్తులకు ఎంపిటిసి, జడ్పిటిసి, సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాల్లో అవకాశం కల్పించే పార్టీలను ఆదరించి తమను పట్టించుకోని పార్టీలను ఓడించడానికి సిద్ధపడతామన్నారు.
అత్యధిక జనాభా గల బిసి రిజర్వేషన్ అంశంలో కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయంతో పని చేస్తున్నట్లు కనిపిస్తోందని ఆ పార్టీ అధ్యక్ష పదవి కూడా బిసి గౌడ సామాజిక వర్గానికి ఇవ్వడంతో బీసీల పట్ల చిత్తశుద్ధితో ఉందని భావిస్తున్నట్లు తెలిపారు. ఇతర పార్టీలు ఏవి కూడా పార్టీ పదవులు కూడా బీసీలకు అవకాశం కల్పించలేదన్నారు. బీసీ రిజర్వేషన్ అంశంలో బిజెపి కుంటి సాకులు చెప్తోందని కేంద్రంలో అధికారంలో ఉండి కూడా బీసీ రిజర్వేషన్ బిల్లు పాస్ చేయడంలో ఎందుకు వెనకాడుతోందని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ పూర్తయిన అనంతరం వర్గీకరణ కూడా చేయాల్సి ఉందని వాటి ఆధారంగానే వారికి అన్ని రంగాల్లో హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు.