18-05-2025 08:41:29 PM
బీజేపీ సుల్తానాబాద్ మండల అధ్యక్షుడు కందుల శ్రీనివాస్
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యం, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి రైతుల పక్షాన నిలబడి స్థానిక ఎమ్మెల్యేను, అధికార యంత్రాంగాన్ని ప్రశ్నించగా ఆయనపై కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను బీజేపీ నాయకులు, రైతులు తీవ్రంగా ఖండించారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ సుల్తానాబాద్ మండల అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ మాట్లాడుతూ... నియోజకవర్గంలోని పలు ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదని, కొనుగోలు చేసిన ధాన్యానికి గ్రేడింగ్ నిర్ణయించడంలో జాప్యం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుల తరపున సమస్యలను బీజేపీ నాయకుడు సురేష్ రెడ్డి ప్రస్తావిస్తే, వాటికి సరైన సమాధానం చెప్పకుండా వ్యక్తిగత దూషణలకు పాల్పడటం సరికాదన్నారు. ఎమ్మెల్యే,ప్రభుత్వ అధికారులు ప్రజలకు, రైతులకు జవాబుదారీగా ఉండాలని, తమ తప్పులను సరిదిద్దుకుని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై ప్రశ్నిస్తే, సమస్యలను పరిష్కరించాలి తప్ప అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. అలా చేయని పక్షంలో సరైన రీతిలో బుద్ధి చెప్పాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. సురేష్ రెడ్డి ఒక రైతుగా, ప్రజా సేవకుడిగా నిత్యం ప్రజల్లో ఉంటారని, ఆయన రాజకీయ ఎదుగుదలను జీర్ణించుకోలేని కాంగ్రెస్ నాయకులు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని శ్రీనివాస్ మండిపడ్డారు. అసత్య ఆరోపణలు,వ్యక్తిగత దూషణలను సహించేది లేదన్నారు.
కాంగ్రెస్ తీరుపై రైతుల ఆగ్రహం
ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోలులో జాప్యం, గ్రేడింగ్ లో జరుగుతున్న అవకతవకల గురించి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురేష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని రైతులు ఆసరి ఎర్రయ్య, గజే భాస్కర్ రెడ్డి తెలిపారు. తమ గోడును ఆలకించిన సురేష్ రెడ్డి ఈ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా, పత్రికల ద్వారా వెలుగులోకి తెచ్చారని వారు గుర్తు చేశారు. అయితే, రైతుల పక్షాన నిలబడిన సురేష్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు,వ్యక్తిగత దూషనలు చేయడం సరికాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.తమ ధోరణి మార్చుకోవాలని కాంగ్రెస్ నాయకులకు రైతులు సూచించారు. ఈ సమావేశంలో తీగల అశోక్ గౌడ్, కాల్వల శ్రీనివాస్ రెడ్డి,కొల్లూరి సంతోష్,బొడ్డుపల్లి కుమార్ ,బొడ్డుపల్లి సంపత్, గాజా భాస్కర్ రెడ్డి, ఎర్రయ్య, యాతం అనిల్,తదితరులు పాల్గొన్నారు.