18-05-2025 11:33:08 PM
బ్లాక్ స్పాట్స్ ప్రదేశాలను పరిశీలించిన పోలీసులు, ఎన్ హెచ్ ఏఐ అధికారులు
బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బెల్లంపల్లి ఏసిపి రవికుమార్, తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి పర్యవేక్షణలో రోడ్డు ప్రమాద నివారణ చర్యలు చేపట్టారు. తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలైన బ్లాక్ స్పాట్లను ఎస్సై కిరణ్ కుమార్, ఎన్ హెచ్ ఏ ఐ అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్సై కిరణ్ కుమార్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే నేషనల్ హైవే అథారిటీ అధికారులు అజయ్ సునీల్ తో కలిసి బోయపల్లి నుండి రేపల్లెవాడ వరకు ఉన్న బ్లాక్ స్పాట్స్ ప్రదేశాలను పరిశీలించడం జరిగిందన్నారు.
జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణ కోసం, వాహనాల వేగాన్ని తగ్గించడం కోసం అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్లు, సూచిక బోర్డులను, రోడ్డు మధ్యలో లైటింగ్ వ్యవస్థ ఏర్పాటును గురించినట్లు చెప్పారు. ప్రమాదాల నివారణకు సంబంధించిన వాటి గూర్చి హైవే అధికారులకు తెలిపేందుకు బ్లాక్ స్పాట్స్ ప్రదేశాలను పరిశీలించి వారికి తెలియజేశామన్నారు. సంబంధిత హైవే అధికారులు సానుకూలంగా స్పందించారని, త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు.అదేవిధంగా జాతీయ రహదారి దగ్గరలో గల గ్రామాల ప్రజలు రోడ్డును నిర్దేశిత ప్రదేశాలను మాత్రమే దాటాలని, రైతులు వారి పశువులను రోడ్లపైకి విడిచిపెట్టరాదన్నారు. ప్రతి ఒక్కరూ రహదారి నిబంధన సూచనలు పాటించాలని, ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని పోలీసు శాఖ తరఫున విజ్ఞప్తి చేశారు.