16-05-2025 12:48:49 AM
- ఉలిక్కిపడ్డ నాగపల్లి గ్రామం, బ్లాస్టింగ్‌తో ఎగిసిపడ్డ బండరాళ్లు...
- పలువురు గ్రామస్తులకు గాయాలు, భయంతో పరుగులు తీసిన జనాలు
- బ్లాస్టింగ్ అనంతరం ప్రధాన రహదారిపై నాగపెల్లి గ్రామస్తుల రాస్తారోకో
రామగి/మంథని, మే 15 (విజయక్రాంతి): సింగరేణి రామగుండం -3 డివిజన్ పరిధిలోని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్-2 క్వారీలో గురువారం మధ్యాహ్నం బ్లాస్టింగ్ విధ్వంసం తో సమీపంలోని ప్రభావిత గ్రామాలు ఉలిక్కిపడ్డాయి. బ్లాస్టింగ్ దాటికి బండ రాళ్లు ఎగిసిపడి సమీపంలోని నాగపెల్లి గ్రామంలో ఇండ్లపై పడటంతో ఆస్తి నష్టం సంభవించింది.
అలాగే బండరాళ్లు మీద పడటంతో పలువురు గాయపడ్డారు. ఓసిపి ప్రాజెక్టులో పేలుళ్లు జరిగి ఒక్కసారిగా భారీ శబ్దంతో భూమి కంపించినట్లు కావడంతో అసలు ఏం జరుగుతుందో తెలియక జనాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు. పెద్ద పెద్ద బండ రాళ్లు ఎగిసిపడి అతివేగంగా చూసుకొని వచ్చి ఇండ్లపై పడటంతో రేకులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.
ఒకవేళ అవే బండరాళ్లు వచ్చి మీద పడితే ప్రాణ నష్టం జరిగేది అంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. బొగ్గు ఉత్పత్తి పై ధ్యాసతో సింగరేణి అధికారులు పేలుడు పదార్థాల మోతాదు పెంచి బ్లాస్టింగ్ చేపట్టడంతో ఈ ఘటన జరిగిందంటూ ఆరోపించారు. నిత్యం బ్లాస్టింగ్ ల వల్ల గ్రామంలో ఉండలేక పోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ బ్లాస్టింగ్లకు నిరసనగా గ్రామస్తులంతా ప్రధాన రహదారి పైకి చేరుకొని ఎండలో కూడా బైఠాయించి రాస్తారోకో చేపట్టారు.
దీంతో ఇరువైపులా వాహనాలు పెద్ద సం ఖ్యలో నిలిచిపోయాయి. పోలీసులు సంఘటన స్థలం కు చేరుకొని సముదాయించే ప్రయత్నం చేశారు. అయితే బ్లాస్టింగ్ల ప్రభావానికి ఎగసిపడ్డ పెద్దపెద్ద బండరాళ్లు, గాయపడ్డ పలువురిని చూపించి సింగరేణి అధికారులు వచ్చి సమాధానం చెప్పాలని భీష్మించుకు ని కూర్చున్నారు. ఈ సంఘటనతో సింగరేణి రామగుండం- ప్రాంతంలో ఆందోళనకర వాతావరణ నెలకొంది.