16-05-2025 12:49:03 AM
రోడ్డుపై కూలిన వటవృక్షం, తృటిలో తప్పిన ప్రాణాపాయం
మహబూబాబాద్, మే 15 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా లో గురువారం సాయంత్రం ఒక్కసారిగా పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. కేసముద్రం అంబేద్కర్ సెంటర్లో పెద్ద వటవృక్షం ఉన్నఫలంగా నేల కూలింది. ఈ సమయంలోనే ద్విచక్ర వాహనంపై వెళ్తున్న చిన్ననాగారం కు చెందిన యుగంధర్ కు తృటిలో ప్రాణాపాయం తప్పింది.
చెట్టు ఫెల ఫెల మంటూ విరుగుతుండగా గమనించిన ఆయన వెంటనే ద్విచక్ర వాహనాన్ని నిలిపివేయగా అప్పటికే చెట్టు కొమ్మలు కొద్దిగా గీరుకుపోయాయి. చెట్టు విద్యుత్తు లైన్ల పై పడిపోవడంతో విద్యుత్ స్తంభాలు విరిగాయి.
దీనితో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నడిరోడ్డుపై అడ్డంగా చెట్టు విరిగిపడడంతో రాకపోకలు స్తంభించాయి. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ మురళీధర్ రాజ్ హుటాహుటిన అక్కడికి చేరుకొని జెసిబి తెప్పించి రోడ్డుపై పడ్డ చెట్టును పక్కకు తొలగింపజేసి ట్రాఫిక్ క్లియర్ చేశారు. కాగా గాలి దుమారంతో వారాంతపు సంతలో చిరు వ్యాపారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.