30-10-2025 01:50:07 AM
-రక్తదానం చేసిన డీజీపీ, 164 మంది సిబ్బంది
- పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా నిర్వహణ
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 29 (విజయక్రాంతి) : పోలీసు అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమాల్లో భాగంగా డీజీపీ బి. శివధర్ రెడ్డి రక్తదానం చేసి స్ఫూర్తిగా నిలిచారు. బుధవారం డీజీపీ కార్యాలయంలో తొలిసారిగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఆయన పాల్గొని, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడేందుకు ప్రతిఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందు కు రావాలని పిలుపునిచ్చారు. ఒకరు చేసే రక్తదానం ద్వారా రక్తం, ప్లాస్మా, ప్లేట్‌లెట్స్ రూపంలో ముగ్గురి ప్రాణాలను కాపాడవచ్చునన్నారు.
ఇటీవల హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహిం చిన మెగా రక్తదాన శిబిరంలో 4,500 యూనిట్ల రక్తాన్ని సేకరించారని గుర్తుచేశారు. డీజీపీ కార్యాలయంలో ఈ శిబిరం నిర్వహించడం ఇదే తొలిసారి అని ఐజీపీ ఎం. రమేశ్ తన స్వాగతోపన్యాసంలో తెలిపారు. డీజీపీతో పాటు శాంతిభద్రతల అడిషనల్ డీజీపీ మహేశ్ ఎం. భగవత్, ఐజీపీలు ఎస్. చంద్రశేఖర్ రెడ్డి, ఎం. రమేశ్ సహా 164 మంది పోలీస్, మినిస్టీరియల్ సిబ్బంది రక్తదానం చేశారు. రెడ్ క్రాస్ సొసైటీ నిర్వాహకులు రక్తాన్ని సేకరించారు. కార్యక్రమంలో ఏఐజీలు రమణ కుమార్, నాగరాజు, రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు ఈవీ శ్రీనివాసరావు, ఎ. శ్రీరాము లు, పోలీస్ అధికారుల సంఘం రాష్ర్ట అధ్యక్షుడు గోపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.