09-09-2025 09:49:08 PM
వ్యవసాయ విస్తరణ అధికారి ముత్యం తిరుపతి..
మందమర్రి (విజయక్రాంతి): మామిడి తోటలో అంతర పంటల సాగు ద్వారా అధిక లాభాలు సాధించవచ్చని మండల వ్యవసాయ విస్తరణ అధికారి ముత్యం తిరుపతి(Mandal Agricultural Extension Officer Mutyam Tirupati) అన్నారు. మండలంలోని మామిడిగట్టు గ్రామంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో రైతులకు మామిడిలో అంతర పంటల సాగు ప్రయోజనాలను వివరించారు. గ్రామంలో 650 ఎకరాల సాగు విస్తీర్ణం ఉండగా, 550 ఎకరాలలా మామిడి తోటలు గత 30 సంవత్సరాలుగా సాగు చేస్తూ మామిడిగట్టు నామధ్యేయాన్ని సార్ధకం చేసుకున్న గ్రామంగా గుర్తింపు ఉందన్నారు. గత ఐదు సంవత్సరాలుగా మామిడిలో సరైన దిగుబడులు రాక రైతులు నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మామిడి తోటలను పూర్తిగా తీసివేయకుండా మామిడి తోటల మధ్యలో అంతర పంటలుగా పత్తి, పప్పు ధాన్యాలు, వరి వంటి పంటలు సాగు చేయడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందవచ్చని సూచించారు. ముఖ్యంగా పప్పు ధాన్యాలు సాగు చేయడం ద్వారా నత్రజని స్థిరీకరణ జరిగి భూమి పాటు పెరిగి మామిడి తోటలు కూడా మంచి కాపు నిస్తాయని దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు పప్పు ధాన్యాల సాగు వైపు మొగ్గు చూపాలని కోరారు. పప్పు ధాన్యాల మద్దతు ధరతో పాటు పత్తికి కూడా రూపాయలు 8000 క్వింటాలకి మద్దతు ధర ఉన్నందున, ఒక ఎకరా కి 6 నుంచి 8 క్వింటాల దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందని తద్వారా అదనపు ఆదాయాన్ని పొందవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు పాల్గొన్నారు.