22-11-2025 12:00:00 AM
ప్రాంతీయ పశువైద్యశాల కోదాడలో అరుదైన చికిత్స
కోదాడ, నవంబర్; పట్టణానికి చెందిన బసనబోయిన పున్నయ్య మేకపోతుకి విపరీతంగా గోమార్లు పట్టి రక్తం తాగడంతో గురువారం రాత్రి అకస్మాత్తుగా కింద పడిపోయింది. రాత్రి ఎనిమిది గంటలకు హుటాహుటిన ప్రాంతీయ పశువైద్యశాల కోదాడకు తీసుకురాగా పరీక్షించిన అసిస్టెంట్ డైరెక్టర్ డా పి పెంటయ్య మేకపోతు కళ్లు పూర్తిగా పాలిపోయి తెల్లగా మారడం తో రక్తహీనతగా గుర్తించారు.
రక్తానికి సంబంధించిన ప్లాస్మాని రక్తంలోకి ఎక్కించగా కొద్దిగా తేరుకున్న పోతు పూర్తిస్థాయిలో కోలుకోవాలంటే తప్పనిసరిగా రక్తం ఎక్కించాల్సిందేనని వైద్యాధికారి గుర్తించారు. అయితే వేరే మేక రక్తం ఎక్కించడానికి రక్తం సంచులు అందుబాటులో లేవు. దీంతో శుక్రవారం ఉదయం అందుబాటులో ఉన్న వనరులతోనే రైతు వద్ద ఉన్న ఇతర మేకల్లోనీ మూడు మేకల రక్తం తీసి నేరుగా మేకపోతుకు మార్పిడి చేశారు. దీంతో మేకపోతు ఆరోగ్యం కొంతమేర కుదుటపడినట్లు వైద్యాధికారి పెంటయ్య తెలిపారు. ఈ చికిత్సలో సిబ్బంది రాజు, చంద్రకళ, అఖిల్. కరుణ్ లు పాల్గొన్నారు.