calender_icon.png 11 July, 2025 | 3:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలీవుడ్ లక్కీ స్టార్ యోగితా!

18-05-2025 12:00:00 AM

యోగితా బాలి 1970లలో హీరోయిన్‌గా బాలీవుడ్‌లోకి రంగ ప్రవేశం చేసింది. ఆమె అసాధారణమైన ప్రతిభ, ఆకట్టుకునే అందం, నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఒక నటిగానే కాకుండా ఆమె నిర్మాతగా కూడా పేరుతెచ్చుకున్నది. తన సినీ కెరీర్‌లో 110 సినిమాలు చేసింది. ఫర్వానా, జోష్, బేతాల్ చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషించింది. ప్రముఖ నటులు అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నా, దేవానంద్, సంజీవ్ కుమార్, రాజేష్ ఖన్నా, రణధీర్ కపూర్, సునీల్ దత్ వంటి ప్రముఖ నటులతో కలిసి పనిచేసింది. ప్రముఖ నటి గీతా బాలి మేనకోడలే ఈ యోగితా బాలి

యోగితా హీరోయిన్ కంటే గాయకుడు  కిశోర్ కుమార్ మూడో భార్యగానే ఎ క్కువగా వార్తల్లోకి ఎక్కింది. ఆయన రెండో భార్య మధుబా ల మరణించాక కిశోర్ కొంచెం డిప్రెషన్‌లోకి వె ళ్లాడు. ఆ సమయంలో కామన్ ఫ్రెండైన ఒక డాక్టర్ యాంటీ డిప్రెషన్ మందులను యోగితా చేత కిశోర్ కుమార్ ఇంటికి పంపేవాడు. అప్పటికే కిశోర్ స్టార్‌డమ్‌లో ఉండటంతో యోగితా ఆయనను కలవడం సరదాగా భావించింది.

అది కాస్త వివాహ బంధానికి దారి తీసింది. ఇది యోగితా తల్లికి ఇష్టం లేదు. హీరోయిన్‌గా మంచి కెరీర్ ఉండగా ఇలా మూడో భార్యగా యోగితా బాలి జీవితం ముగిసిపోవడం భరించలేకపోయింది. పైగా ఎక్కడ గర్భం దాలుస్తుందో దాని వల్ల యాక్టింగ్‌కి శాశ్వతంగా ఎ క్కడ దూరమవుతుందోనని కిశోర్, యోగితా మధ్య దూరం పెంచింది. దాంతో ఆ పెళ్లి నిలవలేదు. 

విడాకులపై స్పష్టత

యోగితా బాలి, గాయకుడు కిశోర్ కుమార్ బంధం విషయానికి వస్తే.. వాళ్లు ఎలా, ఎప్పుడు కలుసుకున్నారో సరిగ్గా తెలియదు. కానీ మొదటి భర్త కిశోర్ కంటే యోగితా 20 ఏళ్లు చిన్నది. ఈ వయసు తేడానే వారి వైవాహిక బంధాన్ని విచ్ఛిన్నం చేసిందనే అనుమానాలు ఉన్నాయి.

విడాకుల గురించి యోగితా ఒక సందర్భంలో మాట్లాడుతూ.. ‘నాకు కొన్ని సమస్యలున్నాయి. కిశోర్ కుమార్‌తో నా తొలి వివాహం విఫలమైనా, నాకు ప్రేమ మీద నమ్మకం పోలేదు. నేను ఆయన్ని ఎన్నడూ ప్రేమించలేదు. మాకు పెళ్లయినా పిల్లలు కాలేదు. అందుకని నేను ఆయనతో ఇమడలేకపోయా’ అన్నారు యోగితా.  

అతనితో.. శాశ్వత బంధం

నటుడు మిథున్ చక్రవర్తి, యోగితా సినిమా సెట్‌లో తొలిసారి కలిశారు. తొలి పరిచయంలోనే స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం పరిణయంగా మారింది. కిశోర్ కుమార్‌కి విడాకులిచ్చిన  యోగితా మరుసటి సంవత్సరంలోనే మిథున్ చక్రవర్తి పెళ్లి చేసుకుంది. వీరి వైవాహిక బంధం శాశ్వతంగా కొనసాగింది.

వీరికి ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. ‘నాకు సాధారణ గృహిణిగా ఉండటం ఇష్టం. స్టూడియోకి వెళ్లి స్టార్స్ వచ్చే దాక ఎదురు చూడటం కన్నా.. ఇంట్లో ఉండి ఇంటి పనులు చేసుకుంటూ.. మా ఆయన కోసం ఎదురు చూడటం, వచ్చాక ఆయనతో సమయం గడపటం బాగుంది’ అని యోగితా ఓ ఇంటర్యూలో తెలిపారు. 

ఆత్మహత్యా ప్రయత్నం

1980ల తొలినాళ్ళలో నటి శ్రీదేవి, మిథున్ చ క్రవర్తిని రహస్యంగా పెళ్లి చేసుకున్నారనీ వార్తలు వచ్చాయి. వారిద్దరూ వాటిని ఖండించినా.. తమ సంబంధాన్ని బహిరంగంగా అంగీకరించలేదు. వీరిద్దరి మధ్య ప్రేమ ‘జాగ్ ఉఠా ఇన్సాన్’ సినిమా షూటింగ్ సమయంలో మొదలైందని అంటారు. అయితే అప్పటికీ యోగితాను మిథున్ పెళ్లి చేసుకున్నారు. శ్రీదేవితో అతనికి ఉన్న సాన్నిహిత్యం యోగితాను తీవ్రమైన మానసిక సంఘర్షణకు గురై ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. అలా శ్రీదేవి స్వయంగా ఆ బంధం నుంచి దూరమైంది.