05-07-2025 08:44:31 PM
శేరిలింగంపల్లి: త్వరలో జరుగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున మాజీ మేయర్, పీసీసీ ఉపాధ్యక్షుడు బొంతు రాంమోహన్(PCC Vice President Bonthu Rammohan) పేరు అన్యుహంగా ప్రచారంలోకి వచ్చింది. మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఈ స్థానానికి ఖాళీ ఏర్పడటంతో ఉప ఎన్నిక అనివార్యం అయింది. గతంలో గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గా పనిచేయటంతో అందరితో సత్సంబంధాలు ఉండటం, ప్రజలకు కూడా పేరు సుపరిచితం కావటంతో కాంగ్రెస్ అధిష్టానం మాజీ మేయర్ వైపు దృష్టి సారించినట్లు తెలుస్తుంది.
గతంలో మేయర్ గా పనిచేసినప్పటి నుండి ఇదే నియోజకవర్గ పరిధిలో నివాసం ఉండటం కూడా కలిసి వస్తుంది. తాజాగా శనివారం నాడు తన జన్మదినాన్ని సైతం నియోజకవర్గ పరిధిలో నిర్వహించడంతో ఈ ప్రచారానికి బలం చేకూరుస్తుంది. గతంలో పోటీ చేసిన మాజీ భారత క్రికెట్ కెప్టెన్ అజారుద్దీన్ విషయంలో ఈ నియోజకవర్గములో బలంగా ఉన్న ఓ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుండటం కూడా రామ్మోహన్ అభ్యర్థిత్వంపై పార్టీ దృష్టి పెట్టినట్లు ప్రచారంలో ఉంది.
ఏది ఏమైనా బీసీ సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చి కాంగ్రెస్ మరో మారు తమ పార్టీకి బీసీల పట్ల ఉన్న ప్రేమను చాటడానికి ఒక అవకాశంగా ఉపయోగించవచ్చని పావులు కడుపుతున్నట్లు, దాంతో స్థానిక ఎన్నికల్లో కూడా ప్రభావితం చేయవచ్చని భావిస్తుందని సమాచారం. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేతగా రాజకీయ రంగ ప్రవేశం చేసి చర్లపల్లి నుండి కార్పొరేటర్ గా గెలిచి అన్యుహంగా మేయర్ పదవి వరించటం, ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరి పీసీసీలో కీలక బాధ్యతలు ఇవ్వటంతో ఎమ్మెల్యే టికెట్ రేసులో బొంతు కీలకంగా మరనున్నట్లు ప్రచారం జరుగుతోంది.