21-11-2025 01:14:16 AM
కామారెడ్డి, నవంబర్ 20 (విజయక్రాంతి): ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క కాన్వాయిని గురువారం కామారెడ్డి జిల్లా రామా రెడ్డిలో రైతులు కొందరు అడ్డుకున్నారు. సన్న వడ్లకు సంబంధించిన బోనస్ డబ్బులు ఇంకా ఖాతాల్లో పడలేదని రైతులు మంత్రిని నిలదీశారు. దీంతో మంత్రి రైతులపై అసహనం వ్యక్తం చేశారు. రైతుల శ్రేయస్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంటే కొంతమంది గిట్టని వారు కొంతమంది రైతులతో తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని ఇది మంచిపద్ధతి కాదని అన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో అమ్మిన సన్నవడ్లకు బోనస్ డబ్బులు తప్పకుండా ప్రభు త్వం రైతులఖాతాల్లో జమచేసేస్తుందని మంత్రి తెలిపారు. అనవసరంగా రాద్ధాంతం చేయవద్దన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రైతుల పక్షపాతిగా వ్యవహరిస్తూ వారికి అన్ని రంగాల్లో సబ్సిడీలు ఇస్తున్నారన్నారు. కొనుగోలు కేంద్రాల్లో అమ్మిన సన్న రకం వరికి బోనస్ తప్పకుండా ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.
కామారెడ్డి జిల్లాలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కాన్వాయ్‌ని కొంతమంది బీఆర్‌ఎస్ కార్యకర్తలు రైతు ల ముసుగులో వచ్చి అడ్డుకున్నారు. డ్యూటీ లో ఉన్న పోలీసు అధికారి దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు, కాన్వాయ్‌ను అడ్డుకున్న వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. రామారెడ్డికి చెందిన పడిగల శ్రీనివాస్, మాజీ ఎంపీపీ నా రెడ్డి దశరథరెడ్డి, కొత్తల గంగారం, మాజీ సర్పంచ్ బాల్‌దేవ్, మహిపాల్, బీఆర్‌ఎస్ నాయకుడు హనుమాన్ల రాజయ్య, తదిత రులపై కేసు పెట్టినట్లు పోలీసులు తెలిపారు.