02-05-2025 01:19:30 AM
ముంపు ప్రాంతాల్లో ముమ్మరంగా పనులు చేపట్టాలి
జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్
హయత్ నగర్, ఉప్పల్, ఎల్బీనగర్ సర్కిళ్లలో
అభివృద్ధి పనుల పరిశీలన
సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం
ఎల్బీనగర్, మే 1 : ఎల్బీనగర్ జీహెచ్‌ఎంసీ జోనల్ పరిధిలో వచ్చే వర్షాకాలంలోగా ముంపు సమస్య తీరేలా బాక్స్ డ్రైన్ పనులు పూర్తి చేయాలని అధికారులను జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. ఇటీవల బాధ్యతలు తీసుకున్న జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఎల్బీనగర్‌జోనల్ పరిధిలోని హయత్‌నగర్, ఎల్బీనగర్, ఉప్పల్‌సర్కిళ్లలో తొలిసారిగా పర్యటించారు. గురువారం ఉదయం హయత్‌నగర్ సర్కిల్ పరిధిలోని నాగోల్ డివిజన్ లోని సాయినగర్ నుంచి ఆర్టీఏ ఆఫీస్ వరకు జరుగుతున్న 350 మీటర్ల స్మార్ట్ వాటర్ బాక్స్ డ్రైన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. వచ్చే వర్షా కాలంలోపు బాక్స్ డ్రైన్ పనులను పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
బాక్స్ డ్రైన్ నిర్మాణంతో లోతట్టులో ఉన్న కాలనీల్లో ముంపును నివారించవచ్చు అని ఈఈ రమేశ్‌బాబు వివరించారు. అనంతరం బైరామల్ గూడ ఫ్లై ఓవర్ కింద వివిధ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వీలుగా 6 బ్లాక్ ల్లో చేపట్టే స్పోరట్స్ బ్లాక్ లను కమిషనర్ పరిశీలించారు. క్రీడాకారులకు అన్ని విధాలుగా ఉపయోగపడే విధంగా పనులు చేపట్టాలని జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ కు సూచించారు. అనంతరం ఉప్పల్ చౌరస్తా నుంచి ఎస్సార్డీపీ ఫ్లైఓవర్ పనులతో పాటుగా.. నేషనల్ హైవే ఫ్లై ఓవర్ పనులను పరిశీలించారు. ఉప్పల్ నుంచి నారపల్లి సీపీఆర్‌ఐ వరకు ఫ్లై ఓవర్ పనులను పరిశీలించారు. కమిషనర్ వెంట ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, మెయింటెనెన్స్ ఈఈలు కార్తీక్, రమేశ్‌బాబు, డిఫ్యూటీ కమిషనర్లు తిప్పర్తి యాదయ్య, ఆంజనేయులు ఉన్నారు.