02-05-2025 01:19:55 AM
వ్యాపార అభివృద్ధి కోసమేనని పోలీసుల నిర్ధారణ ఆలస్యంగా వెలుగులోకి
సదాశివపేట, మే 1:సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో బాలికను బలివ్వడానికి క్షుద్ర పూజలు చేస్తున్నారనే ప్రచారం కలకలం రేపింది. కాగా వ్యాపార అభివృద్ధి కోసం బాలిక చేత దైవ పూజలు నిర్వహించినట్లుగా నిర్ధారణ జరగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి..
సదాశివపేట పట్టణంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ధర్మేంద్ర గత 20 సంవత్సరాలుగా ఇక్కడ బీరువాల తయారీ చేస్తూ జీవిస్తున్నాడు. తన వ్యాపారం సజావుగా అభివృద్ధి బాటలో నడవాలంటే పూజలు చేయాలని తలచి వారి సంప్రదాయ ప్రకారం బాలిక చేత పూజలు చేయించి పాదాభివందనం చేయాలని అయోధ్య నుంచి ఓ పూజారిని రప్పించారు.
మంగళవారం అర్ధరాత్రి బీరువాలు తయారు చేసే తన కార్ఖానాలో పూజలు నిర్వహిస్తుండగా ఇది గమనించిన కొందరు స్థానికులు బాలికను బలిచ్చేందుకు క్షుద్ర పూజలు చేస్తున్నారని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్థానిక పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించి పూజలను నిలిపివేశారు.
అయితే ఈ విషయం పట్టణంలో దావానలంలా వ్యాపించింది. పోలీసులు విచారణ చేపట్టగా ధర్మేంద్ర వ్యాపార అభివృద్ధి కోసమే పూజలు చేసినట్లు నిర్ధారించారు. గతంలో కూడా తన సోదరుడు ఇలాంటి పూజనే నిర్వహించారని తెలిసింది. కాగా ఈ విషయంలో పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయకపోవడం గమనార్హం.