calender_icon.png 31 July, 2025 | 12:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు

25-07-2025 12:28:09 AM

  1. తన ఫోన్ ట్యాపింగ్ జరగదేదన్న సీఎం వ్యాఖ్యలతో వాళ్ల అసలు రంగు బయటపడింది
  2. కేసీఆర్ ప్రభుత్వంలో వెలుగు చూసిన అనేక కేసులు విచారణ అటకెక్కించారు
  3. మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ ధ్వజం

హైదరాబాద్, జూలై 24 (విజయక్రాంతి): రాష్ట్రంలో మరోసారి బీఆర్‌ఎస్-కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు బయటపడ్డాయని బీజేపీ ఎంపీ, ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. రాష్ర్ట ప్రజలను మభ్యపెట్టే ‘హైడ్ అండ్ సీక్’ రాజకీయ నాటకం కొనసాగుతోందని గురువారం ఆమె ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు.

రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఫోన్ ట్యాపింగ్, వ్యక్తిగత నిఘా, గోప్యత ఉల్లంఘనలపై రేవంత్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారని.. తనతో పాటు తన కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్టు వాపోయారని గుర్తుచేశారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే తనకు నోటీసులు వచ్చేవి కదా అని మాట్లాడటం చూస్తే.. గతంలో రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నాటకమా.. లేక ఇప్పుడు బీఆర్‌ఎస్ పార్టీతో కుదిరిన ప్యాకేజీ డీలే కారణమా అని సందేహం వ్యక్తం చేశారు.

బీఆర్‌ఎస్-కాంగ్రెస్ మధ్య ప్యాకేజీ బేరాలు కుదిరాయనడానికి ఇది స్పష్టమైన నిదర్శనంగా ఆమె అభివర్ణించారు. ఈ రెండు పార్టీలు ప్రజల ముందు మాటల యుద్ధం, కుమ్ములాటలు చేసుకుంటూ.. చీకట్లో ప్యాకేజీలు కుదుర్చుకుంటున్న విషయం మరోసారి స్పష్టమైందన్నారు. పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ కుటుంబం వేలకోట్ల అవినీతికి పాల్పడిందని.. సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన రేవంత్‌రెడ్డి.. అధికారంలోకి వచ్చాక అదే బీఆర్‌ఎస్ పార్టీకి రక్షణ కవచంగా మారారని ఆరోపించారు.

కేసీఆర్ ప్రభుత్వంలో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులు, విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అవినీతి, ఫార్ములా ఈ-రేసింగ్ కేసులో నిధుల మళ్లింపు, ల్యాండ్ స్కామ్‌లు, ఉద్యోగ నియామకాల్లో చోటుచేసుకున్న అవకతవకలు.. తదితర కేసులన్నింటిపై విచారణ చేపడతామని వాగ్దానం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పటి వరకు అసలు దోషులను ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు.