30-12-2025 01:48:02 AM
అధికారంలోకి వచ్చాక చుక్కలు చూపిస్తాం
బీఆర్‌ఎస్ నాయకులపై దాడులను ఖండిస్తూ ఎస్పీకి ఫిర్యాదు
కాంగ్రెస్ ఆగడాలు అధికమైనట్లు ఆరోపించిన మాజీ ఎమ్మెల్యేలు
వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతలపై బిఆర్‌ఎస్ నేతల తీవ్ర విమర్శలు
వికారాబాద్, డిసెంబర్-29: వికారాబాద్ జిల్లాలో బీఆర్‌ఎస్ నాయకులపై, బీఆర్‌ఎస్ సర్పంచులపై, అధికార కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దాటులను వెంటనే అరికట్టాలని వికారాబాద్ జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలు అన్నారు. సోమవారం జిల్లా ఎస్పీని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నాయకుల అతి ఉత్సాహం, దౌర్జన్యాలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు.
తమ కార్యకర్తలపై దాడులు చేస్తున్న వారి చరిత్రను పింక్ బుక్కులో రాసుకుంటున్నామని అధికారంలోకి వచ్చాక వారికి చుక్కలు చూపించడం ఖాయమని హెచ్చరించారు. కోట్ పల్లి గ్రామంలో నూతన సర్పంచ్ భర్తపై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కోట్‌పల్లిలో సర్పంచ్ భర్తపై దాడి చేసిన వారిని మాత్రమే కాకుండా, దాని వెనుక ఎవరు ఉన్నా సరే వదిలి పెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
రానున్న రోజుల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకుల కార్యకలాపాలన్నింటినీ తమ పింక్ బుక్‌లో నమోదు చేసుకున్నామని అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరినీ విడిచిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది కాంగ్రెస్ నేతలకు చుక్కలు చూపెడతామని హెచ్చరించారు. కోట్ పల్లి ఘటనపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.