16-12-2024 02:52:21 PM
హైదరాబాద్: స్పీకర్ ఛాంబర్ లో బీఏసీ సమావేశం ముగిసింది. అసెంబ్లీ పనిదినాలపై బీఏసీ నిర్ణయం తీసుకోలేదు. బీఏసీ సమావేశం నుంచి బీఆర్ఎస్, ఎంఐఎం వాకౌట్ చేశాయి. బీఏసీ భేటీ నుంచి హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, అక్బరుద్దీన్ ఓవైసీ వాకౌట్ చేశారు. ఎన్ని రోజులు సభ నడుపుతారో చెప్పడం లేదని హరీశ్ రావు అన్నారు. బీఏసీ లేకుండానే బిల్లులు పెట్టడం సంప్రదాయ విరుద్ధమన్నారు. సభ కనీసం 15 రోజులు నడపమని కోరినట్లు ఆయన తెలిపారు. 3,4 రోజుల సభ నడుపుతామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోందని స్పష్టం చేశారు. టీ షర్టులతో వస్తే ఎందుకు ఆపారని నిలదీశామన్నారు. టీ షర్టుతో పార్లమెంటు రాహుల్ గాంధీ వెళ్లట్లేదా? ప్రశ్నించారు. లగచర్ల రైతులకు బేడీలపై చర్చించాలంటే స్పందించట్లేదని చెప్పారు. పర్యాటకం కంటే లగచర్ల రైతులపై చర్చ ముఖ్యమని చెప్పామని ఆయన తెలిపారు. ప్రతి రోజు జీరో అవర్ ఉండాలని కోరామన్నారు. తమ పార్టీ సభ్యుల సంఖ్య మేరకు సమయం కోరామన్న హరీశ్ రావు హౌస్ కమిటీలు ఏర్పాటు చేయాలని కోరామని వెల్లడించారు.