03-01-2026 10:06:03 PM
3,4,5,6 వార్డుల్లో అభివృద్ధిని గుర్తు చేసిన మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్
ఇల్లందు టౌన్ ,(విజయక్రాంతి): ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని 3,4,5,6 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం విస్తృత పర్యటన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జ్ బానోత్ హరిప్రియ నాయక్, బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యులు, మాజీ జిల్లా అధ్యక్షులు దిండిగాల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇల్లందు మున్సిపాలిటీలోని 24 వార్డులను అభివృద్ధి చేసిన ఘనత పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.
ముఖ్యంగా 3,4,5,6 వార్డుల్లో గత కొన్నేళ్లుగా ఎదురైన తాగునీటి సమస్యను పరిష్కరించడంతో పాటు ప్రతి గల్లీకి సిమెంట్ రోడ్లు, పక్కన కాలువలు, ప్రధాన కూడళ్లలో వీధి దీపాల ఏర్పాటు ద్వారా మౌలిక వసతులను మెరుగుపరిచామని తెలిపారు. ఇల్లందు ప్రధాన రహదారి అభివృద్ధితో పాటు బస్సు డిపోను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. కేసీఆర్, కేటీఆర్, తన్నీరు హరీష్ రావు సహకారంతో వైద్య రంగం, పట్టణాభివృద్ధి రంగాల్లో ఇల్లందు మున్సిపాలిటీని అన్ని విధాలా అభివృద్ధి చేశామని, ముఖ్యంగా ప్రధాన రహదారి వెంట మధ్యస్థ లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి పట్టణ రూపురేఖలను మార్చినట్లు వివరించారు.
రానున్న పురపాలక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ శ్రేణులు ఎప్పుడైనా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు సిలివేరి సత్యనారాయణ, పట్టణ అధ్యక్షులు మహమ్మద్ అబ్దుల్ జబ్బర్, ప్రధాన కార్యదర్శి పరిచూరి వెంకటేశ్వర్లు, పట్టణ ఉపాధ్యక్షుడు అబ్దుల్ నబీ, మహిళా అధ్యక్షురాలు నెమలి ధనలక్ష్మి, మహిళా ప్రధాన కార్యదర్శి కొక్కు సరిత, మాజీ వార్డ్ కౌన్సిలర్లు, పట్టణ నాయకులు, యువజన నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.