28-09-2025 12:48:04 AM
-మూడు డైరెక్టర్ల స్థానాలకు రెండింటింలో గెలిచిన గులాబీ పార్టీ
-ఒక స్థానానికే పరిమితమైన కాంగ్రెస్
-సంస్థ చైర్మన్ తీరుపై పాడి రైతుల ఆగ్రహం
ఎల్బీనగర్, సెప్టెంబర్ 27 : తెలంగాణ రాష్ర్టంలో గుర్తింపు పొందిన నల్లగొండ, రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార యూనియన్ లిమిటెడ్, మదర్ డెయిరీకి మూడు డైరెక్టర్ల స్థానాలకు శనివారం జరిగిన ఎన్నికల్లో రెండు స్థానాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు రచ్చ లక్ష్మినర్సింహారెడ్డి, సంధిల భాస్కర్ గౌడ్ విజయం సాధించగా మరో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి కర్నాటి జయశ్రీ గెలుపొందినట్లు ఎన్నికల అధికారి ఎ.వెంకట్రెడ్డి వెల్లడించారు. శనివారం ఎల్బీనగర్ నియోజకవర్గం హయత్ నగర్ ఎస్పీ కన్వెన్షన్ హాలులో మదర్ డెయిరీ మూడు డైరెక్టర్ల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా జనరల్ మహిళా రిజర్వు పాలకవర్గ స్థానానికి నలుగురు పోటీ పడగా వారిలో కర్నాటి జయశ్రీ 178 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది.
పోటీదారుల్లో ఉన్నటువంటి గంట్ల రాధికకు 55 ఓట్లు, మోతె పూలమ్మకు 03 ఓట్లు, సూదగాని విజయకు 63 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 311 ఓట్లకు గాను 308 మంది ఓటింగ్లో పాల్గొనగా 297 ఓట్లు చెల్లుబాటు అయ్యా యి. 11 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. రెండు జనరల్ పాలకవర్గ స్థానాలకు ఐదుగురు పోటీ పడగా వారిలో సందిల భాస్కర్ గౌడ్ కు 240 ఓట్లు, రచ్చ లక్ష్మి నర్సింహారెడ్డికి 154 ఓట్లు మెజార్టీతో విజయం సాధిం చారు. కుంచాల ప్రవీణ్ రెడ్డికి 09 ఓట్లు, పెద్దిరెడ్డి భాస్కర్రెడ్డికి 16 ఓట్లు, శీలం వెంకటనర్సింహారెడ్డికి 152 ఓట్లు పోలయ్యాయి.
మొత్తం 311 ఓట్లకు గాను 308 మంది ఓటింగ్లో పాల్గొనగా 307 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. ఒక ఓటు తిరస్కరణకు గురైంది. ఫలితాల అనంతరం ఎస్వీ కన్వెన్షన్ ఎదుట పెద్ద ఎత్తున బాణసంచాలు కాల్చి సంబురాలు జరిపారు. కాగా మూడింటికి రెండు స్థానాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు రచ్చ లక్ష్మి నర్సింహారెడ్డి, సందిల భాస్కర్ గౌడ్ విజ యం సాధించడంతో కాంగ్రెస్ అభ్యర్థినిగా జయశ్రీ ఒకేస్థానం కైవసం చేసుకోవడంతో కాంగ్రెస్ చైర్మన్లు ఆందోళన చెందారు. ఆలేరు ఎమ్మెల్యే అయిలయ్య, డీసీసీ అధ్యక్షుడు సంజీవరెడ్డి, మదర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
బకాయిలు చెల్లించాలి : సొసైటీ రైతుల ఆందోళన
హయత్ నగర్ మదర్ డెయిరీ సంస్థ గత మూడు నెలలుగా సొసైటీ రైతులకు చెల్లించాల్సిన పాల బిల్లుల బకాయిలను వెంటనే చెల్లించాలని సొసైటీ రైతులు ఆందోళన చేపట్టారు. మదర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి పదవీ నుంచి తొలగిపోవాలని డిమాం డ్ చేస్తూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో మాజీ చైర్మన్ గంగుల కృష్ణారెడ్డి, మేనేజర్ బెలిదె కృష్ణ, ఎన్నికల అధికారి ఎ.వెంకట్ రెడ్డి, పాలకవర్గ డైరెక్టర్లు పాల్గొన్నారు.