23-05-2025 12:37:44 AM
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి
హైదరాబాద్, మే 22 (విజయక్రాంతి): ధాన్యం కొనుగోలు అంశంలో బీఆర్‌ఎస్ అసత్య ప్రచారం చేస్తుందని రాష్ర్ట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ప్రస్తుత రబీ సీజన్‌లో గురువారం సాయంత్రం వరకు రాష్ర్ట వ్యాప్తంగా 60.6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు తెలిపారు. అదే బీఆర్‌ఎస్ హయాంలో 2022 రబీ సీజన్ లో మే 22 నాటికి కొనుగోలు చేసింది కేవలం 36.6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమేనని గుర్తుచేశారు.
గత ప్రభుత్వంతో పోల్చి చూస్తే ప్రస్తుత రబీ సీజన్‌లో మే 22 నాటికే రాష్ర్ట ప్రభుత్వం 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అధికంగా కొనుగోలు చేసిందని వెల్లడించారు. చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటు తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తీసుకున్న రైతాంగ అనుకూల విధానాలతో అటు ఖరీఫ్ ఇటు రబీ లోనూ రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి అయిందని మంత్రి వివరించారు. అందుకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచినట్టు పేర్కొన్నారు.