27-03-2025 10:35:38 PM
కామారెడ్డి జిల్లా చింతమాన్ పల్లి గ్రామంలో ఘటన..
డబ్బులు అడిగిన పాపానికి దారుణ హత్య..
ముత్యంపేటలో పోలీసుల భారీ బందోబస్తు..
కామారెడ్డి (విజయక్రాంతి): సాయం చేద్దామన్న వ్యక్తిని డబ్బుల కోసం దారుణ హత్య చేసిన ఘటన కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం చింత మాన్ పల్లిలో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ముత్యంపేట గ్రామానికి చెందిన ఈ రబోయిన రమేష్ (35) ఓ ప్రైవేట్ ఫైనాన్స్ లో గత కొద్ది రోజుల క్రితం కారును కొనుగోలు చేశాడు. నెలసరికి కిస్తులు చెల్లించడం వీలు కాకపోవడంతో తన పేరున ఉన్న కారును ముత్యంపేట గ్రామానికి సమీపంలో ఉన్న చింతమాను పల్లి గ్రామానికి చెందిన పల్లె పోచయ్యకు కారును అమ్మాడు. నెలసరి కిస్తీలు ఫైనాన్స్ కు చెల్లించిన తర్వాత తన పేరున కారు కాగితాలు చేయించి ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నారు.
పల్లె పోచయ్య కారుకు సంబంధించిన నెలసరి వాయిదాలు చెల్లించకపోవడంతో కారు రమేష్ పేరుపై ఉండడంతో పాటు ఫైనాన్స్ కూడా అతని పేరు న ఉండడంతో నెలసరి కిస్తీలు చెల్లించాలని లేకుంటే కారును అప్పగించాలని ఫైనాన్స్ వారు ఒత్తిడి చేయడంతో ఈ విషయాన్ని చింత మాన్ పల్లికి చెందిన పల్లె పోచయ్యకు ముత్యంపేటకు చెందిన ఈరబోయిన రమేష్ కారు కిస్తులు చెల్లించాలని చెప్పగా పోచయ్య నిర్లక్ష్యం చేస్తున్నారు. కారును కూడా అందుబాటులో ఉంచకుండా అతడు ఇటుక బట్టీ లు నిర్వహిస్తున్న చోట కారును నిలుపుకున్నట్లు సమాచారం తెలుసుకున్న రమేష్ గురువారం తెల్లవారుజామున ఇటుక బట్టీల ప్రాంతానికి వెళ్లిన రమేష్ కారుకు సంబంధించిన నెలసరి వాయిదాల బకాయి డబ్బులు చెల్లించాలని లేకుంటే కారును అప్పగిస్తే ఫైనాన్స్ వారికి అప్పగిస్తానని చెప్పగా ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు సమాచారం.
ఈ విషయంపై పల్లె పోచయ్య తన ఇటుక బట్టి కూలీలతో కలిసి రమేష్ పై దాడి చేసి దొంగగా చిత్రీకరించి చెట్టుకు కట్టివేసి దేహశుద్ధి చేశారు. కారు నడుపుకొని కుటుంబాన్ని పోషించుకొని డబ్బులు ఫైనాన్స్ కు చెల్లిస్తాడని భావించిన రమేష్ కు తన ప్రాణాలకే ముప్పు వస్తుందని ఊహించని ఊహించుకోలేకపోయాడు. కారు ఇవ్వాలని లేకుంటే ఫైనాన్స్ వారికి డబ్బులు కట్టాలని రమేష్ అడిగిన పాపానికి దొంగగా చిత్రీకరించి మట్టుపెట్టే ప్రయత్నం చేశారు. చెట్టుకు కట్టివేసి కొట్టడంతో సృహ తప్పి పడిపోయిన రమేష్ చనిపోయాడని భావించి పల్లె పోచయ్య పోలీసులకు కారును దొంగ లించు కోవడానికి గుట్టు చప్పుడు కాకుండా వచ్చాడని దొంగగా భావించి తమ ఇటుక బట్టి కూలీలు పట్టుకొని ప్రశ్నించగా సమాధానం సరిగా చెప్పకపోవడంతో దొంగగా భావించి చెట్టుకు కట్టి కొట్టారని స్థానిక పోలీసులకు సమాచారం అందించినట్లు తెలుస్తుంది.
గాయపడిన రమేష్ ను కుటుంబ సభ్యులు కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే లోగా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుని కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు దోమకొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ముత్యంపేట గ్రామస్తులు చింతామణి పల్లికి వచ్చి పల్లె పోచయ్యపై దాడి చేస్తారన్న ఊహాగానాలు రావడంతో పోలీసులు చింతమన్ పల్లి గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ముత్యంపేట చింతామణి పల్లి గ్రామాలలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సంఘటన స్థలానికి కామారెడ్డి ఏఎస్పి చైతన్య రెడ్డి భిక్కనూర్ సిఐ సంపత్ కుమార్ దోమకొండ స్రవంతి ప్రత్యేక పోలీస్ బలగాలు చేరుకొని రమేష్ అంత్యక్రియలు నిర్వహించే వరకు పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ప్రస్తుతం చింతామణిపల్లిలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.