15-07-2025 02:58:43 PM
భార్య భర్తల పంచాయతీ జరుగుతుండగా మారణాయుధాలతో దాడులు...
కత్తిపోట్లకు ఇద్దరు బలి ఇద్దరు పరిస్థితి విషమం
పెద్దపల్లి, (విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లాలో(Peddapalli district) దారుణం చోటు చేసుకుంది. పంచాయితీ ఉంది రమ్మని పిలిచి పథకం ప్రకారం మారణాయుధాలతో దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇద్దరు కత్తిపోట్లకు గురై మృతి చెందగా మరికొందరు తీవ్ర గాయాలతో పెద్దపల్లి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లి(Suglampally Village) గ్రామ సమీపంలోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకున్న ఈ దారుణం జిల్లాలో కలకలం రేపింది.
ఓదెల మండల కేంద్రం కు చెందిన మారయ్య - కనకమ్మ అనే దంపతుల మధ్య తలెత్తిన విభేదాల నేపథ్యంలో మంగళవారం పంచాయతీ జరుగుతుండగా, ఇరువర్గాల మధ్య పరస్పరం వాగ్వివాదాలు చెలరేగాయి. దీంతో కోపోద్రిక్తులైన భర్త తరపున బంధువులు పక్కా పథకం ప్రకారం మారణాయుధాలతో భార్య తరపు బంధువులపై దాడి చేశారు. ఆ కత్తిపోట్లకు పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామానికి చెందిన గాండ్ల గణేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి సైతం మృతి చెందినట్లు తెలిసింది. ఇంకా తీవ్రగాయాలతో పెద్దపల్లి హాస్పిటల్లో మరికొందరు చికిత్స పొందుతున్నారు. ఇరు వర్గాలకు చెందిన గ్రామాల లో నిశ్శబ్ద వాతావరణం ఆవహించింది. మృతుల బంధువుల అర్ధనాథాలతో పెద్దపల్లి ప్రభుత్వ దవాఖాన లో విషాదం అలుముకుంది.