calender_icon.png 16 July, 2025 | 3:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర అంబులెన్స్ డ్రైవర్లకు ట్రాఫిక్ ఏసీపీ కౌన్సిలింగ్

15-07-2025 08:32:29 PM

కరీంనగర్ క్రైం,(విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన రహదారిపై అంబులెన్స్‌లను అడ్డదిడ్డంగా నిలపడం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోందని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కరీంనగర్ ట్రాఫిక్ ఏసీపీ యాదగిరి స్వామి తెలిపారు. మంగళవారం ఆసుపత్రి రోడ్డుపై నిలిపి ఉంచిన అంబులెన్స్ డ్రైవర్లకు ఆయన స్వయంగా కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ కరీం, ఇన్‌స్పెక్టర్ రమేష్ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఏసీపీ యాదగిరి స్వామి మాట్లాడుతూ, అంబులెన్స్‌లు అత్యవసర సేవల్లో ఉంటాయని, అయితే వాటిని రహదారిపై ఇష్టానుసారంగా నిలిపి ఉంచడం వల్ల అంబులెన్స్ రాకపోకలకు మరియు సాధారణ వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. అంబులెన్స్ డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, ప్రయాణీకులను ఎక్కించుకునేందుకు, దించేందుకు మాత్రమే రోడ్డు పక్కన ఆగాలని సూచించారు. రోడ్డుపై వరుసగా నిలపడం వల్ల ఇతర వాహనాలు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుందని, దీంతో ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు.

అంతేకాకుండా అంబులెన్స్‌లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన పోలీసులు, అంబులెన్స్‌లలో ఆవశ్యకమైన వైద్య సామాగ్రి, ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉన్నాయా లేదా అని తనిఖీ చేశారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి డ్రైవ్‌లు కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కౌన్సిలింగ్ డ్రైవ్‌తో అంబులెన్స్ డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచుకోవాలన్నారు.