05-05-2025 02:02:25 AM
మేడ్చల్, మే 4 (విజయక్రాంతి): అల్వాల్ సమీపంలోని సూర్యనగర్‌లో వృద్ధ దంపతులు కనకయ్య (70), రాజమ్మ (65) దారుణ హత్యకు గురయ్యారు. నిద్రిస్తున్న వారిని కర్రలతో దాడి చేయడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ కథనం ప్రకారం శనివారం రాత్రి దుండగులు ఇంట్లోకి ప్రవేశించి వృద్ధ దంపతులను కర్రలతో తలపై బలంగా కొట్టిన ఆనవాళ్లు ఉన్నాయి.
ఆ తర్వాత మృతురాలి ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలతో పాటు ఇంట్లో ఉన్న లక్ష రూపాయలు ఎత్తుకెళ్లారు. ఆదివారం స్థానికులు డయల్ 100కు కాల్ చేశారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, ఏసీపీ, మేడ్చల్ అడిషనల్ డీసీపీ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు.
వృద్ధ దంపతులిద్దరూ రక్తపు మడుగులో చనిపోయి ఉన్నారు. దుండగులు ఉద్దేశపూర్వకంగా హత్యచేశారా, పాత కక్షలు ఏమైనా ఉన్నాయా అని పరిశీలిస్తున్నామని డీసీపీ వివరించారు. పలు ఆధారాలు లభించాయని త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు.
దర్యాప్తు ముమ్మరం: అల్వాల్‌లో వృద్ధ దంపతుల దారుణ హత్య ఈ ప్రాంతంలో కలకలం రేపింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లందు ప్రాంతంలోని మాణిక్యారం గ్రామానికి చెందిన దంపతులు మూడేళ్లుగా సూర్యనగర్‌లో నివసిస్తూ వాచ్మెన్‌గా పనిచేస్తున్నారు.
త్వరలో స్వగ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అంతలోనే దారుణ హత్యకు గురయ్యారు. వృద్ధ దంపతుల హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. డాగ్ స్క్వాడ్ తీసుకువచ్చారు. సీసీ కెమెరాలు పరిశీలించారు. డీసీపీ సురేష్ కుమార్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.