07-11-2025 01:00:10 AM
13 రోడ్ల నిర్మాణానికి పాలనా అనుమతులు
హుస్నాబాద్, నవంబర్ 6 : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని గిరిజన తండాల ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త అందించింది. సుదీర్ఘ కాలంగా రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న అనుసంధానం కాని 13 ఎస్టీ ఆవాసాలకు బీటీ రోడ్లు నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.24.80 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవతో గిరిజన సంక్షేమ శాఖ ’బీటీ రోడ్స్ టు ఎస్టీ హాబిటేషన్స్’ గ్రాంట్ కింద విడుదల చేసింది. జీవో ఆర్ టీ నంబర్ 276 ద్వారా మొత్తం 13 పనులకు పరిపాలనా అనుమతులు జారీ అయ్యాయి.
నిధులు మంజూరు కావడంతో హుస్నాబాద్ నియోజకవర్గంలోని గిరిజన తండాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంజూరైన 13 బీటీ రోడ్లు హుస్నాబాద్ నియోజకవర్గంలోని మూడు జిల్లాల పరిధిలో ఉన్నాయి. హుస్నాబాద్ నియోజకవర్గం పరిధిలోని మూడు జిల్లాలోని ఎస్టీ తండాలకు ఈ నిధులు దక్కాయి. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి రాంనగర్ తండా వరకు 1.20 కిలోమీటర్ల రోడ్డుకు రూ.1.20 కోట్లు, ములకనూరు నుంచి నరహరి తండా వరకు 3.50 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.3.50 కోట్లు మంజూరయ్యాయి.
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయికల్ నుంచి రాయికల్ తండా వరకు 3.50 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.3.50 కోట్లు కేటాయించారు. సిద్దిపేట జిల్లా పరిధిలోని అక్కన్నపేట మండలంలో అత్యధిక రోడ్లకు నిధులు మంజూరయ్యాయి. కేశనాయకతండా నుంచి పెద్దమ్మ టెంపుల్ పీడబ్ల్యూడీ రోడ్డు గట్లమల్యాల వయా వడ్డెరకాలనీ వరకు 2.50 కిలోమీటర్ల బీటీ రోడ్డుకు రూ.2.50 కోట్లు, మల్లారం ఎక్స్ రోడ్డు నుంచి దుబ్బతండా వరకు 2.0 కిలోమీటర్ల రోడ్డుకు రూ.2 కోట్లు మంజూరయ్యాయి.
రాజతండా నుంచి పంచారాయితండా వరకు 2.0 కిలోమీటర్ల రోడ్డుకు రూ.2 కోట్లు, కపూర్ నాయక్ తండా దుద్యాతండా నుంచి తిరుమల్ తండా ( శ్రీరామ్ తండా) వరకు 1.50 కిలోమీటర్ల రోడ్డుకు రూ.1.50 కోట్లు కేటాయించారు.
అక్కన్నపేట మండలం పరిధిలోనే తుక్కితండ నుంచి పీడబ్ల్యూడీ రోడ్డు (కపూర్ నాయక్ తండా) వయా దేవుల్ నాయక్ తండా వరకు 1.50 కిలోమీటర్ల రోడ్డుకు రూ.1.50 కోట్లు, ఆర్ అండ్ బీ రోడ్డు నుంచి ఇప్పల్ తండా వయా దుబ్బతండా (పంతుల్ తండా జీపీ) వరకు 1.60 కిలోమీటర్ల రోడ్డుకు రూ.1.60 కోట్లు, ఆర్ అండ్ బీ రోడ్డు శ్రీరామ్ కాలనీ నుంచి తెల్లపలుగు తండా (దుబ్బతండా జీపీ) వరకు 1.00 కిలోమీటర్ల రోడ్డుకు రూ.1కోటి మంజూరయ్యాయి.
ఆర్ అండ్ బీ రోడ్డు నాన్యాతండా నుంచి శ్రీరామ్ తండా వరకు 1.00 కిలోమీటర్ల రోడ్డుకు రూ.1 కోటి, పన్యానాయక్ తండా నుంచి పంతులు తండా వరకు 2.50 కిలోమీటర్ల రోడ్డుకు రూ.2.50 కోట్లు, బోరింగ్ తండా నుంచి శ్రీరామ్ తండా వరకు 1.0 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.1కోటి మంజూరయ్యాయి.