calender_icon.png 7 November, 2025 | 2:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెట్ ల్యాండ్ పరిరక్షణతో పర్యావరణానికి మేలు: అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి

07-11-2025 01:00:24 AM

ఖమ్మం టౌన్, నవంబరు 6 (విజయక్రాంతి): వెట్ ల్యాండ్ పరిరక్షణతో పర్యావరణానికి మేలు జరుగుతుందని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం నిర్వహించిన వెట్ ల్యాండ్ కమిటీ సమావేశంలో అదనపు కలెక్టర్, జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ తో కలిసి పాల్గొన్నారు.వెట్ ల్యాండ్ కమిటీ బాధ్యతలు, ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను కమిటీ సభ్యులకు జిల్లా అటవీ శాఖ అధికారి వివరించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ చిత్తడి భూముల (వెట్ ల్యాండ్) సంరక్షణ కోసం 2017 సంవత్సరంలో ప్రభుత్వం కొన్ని నిబంధనలు ప్రవేశపెట్టిందని అన్నారు. వెట్ ల్యాండ్ గుర్తింపు, సంరక్షణ కోసం జిల్లా వెట్ ల్యాండ్ కమిటీని కలెక్టర్ చైర్మన్ గా ఏర్పాటు చేయడం జరిగిందని అదనపు కలెక్టర్ తెలిపారు.ప్రాథమికంగా నోటిఫై చేసేందుకు రాష్ట్రంలో 11 వేల 468 వెట్ ల్యాండ్ లను గుర్తించడం జరిగిందని, ఖమ్మం జిల్లాలో 467 వెట్ ల్యాండ్ లు 8 వేల 911 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్నట్లు తేలిందని అదనపు కలెక్టర్ తెలిపారు.

చెరువులు, రిజర్వాయర్, కాల్వల ఫీడర్ చానెల్స్, మత్స్య శాఖ పరిధిలో ఉన్న ప్రణాళిక, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పరిధిలో ఉన్న సమాచారం పరిగణలోకి తీసుకుంటూ జిల్లాలో ఉన్న చిత్తడి నేలలు ధృవీకరించాలని అన్నారు.చిత్తడి నేలలు గుర్తించడం ద్వారా భూమి యాజమాన్యం ఎట్టి పరిస్థితుల్లో మారదని, రైతులు, భూ యాజమాన్యులు ఎవరు అనవసర ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు. చిత్తడి నేలల్లో కొన్ని పరిమితులు మాత్రమే అమలు చేయడం జరుగుతుందని అన్నారు.

చెన్నై మహానగరంలో ఇటీవల వచ్చిన భారీ వరదలకు చిత్తడి నేలలు సంరక్షించక పోవడం ప్రధాన కారణమని తేలిందని అన్నారు. చిత్తడి నేలల భూ స్వభావం మార్పు చేయరాదని, పరిశ్రమలు ఏర్పాటు చేయవద్దని, నిర్మాణ వ్యర్థాలు, ఇతర వ్యర్థాలు వేసేందుకు ఉపయోగించవద్దని, శుద్ది చేయని వ్యర్దాలను విడిచి పెట్టడానికి వీలు లేదని అన్నారు.రాష్ట్రం నుంచి మనకు వచ్చిన సమాచారం మేరకు క్షేత్రస్థాయిలో చిత్తడి నేలల్లో పర్యటించి స్థానిక పరిస్థితులపై నివేదిక సిద్దం చేసి జిల్లాలో గుర్తించిన చిత్తడి నేలలను 6 నెలల లోపు నోటిఫై చేయాలని అదనపు కలెక్టర్ తెలిపారు. చిత్తడి నేలల్లో అనేక రకాల మొక్కలు, పక్షులు, జంతువులు ఆవాసాలను ఏర్పర్చుకుంటాయని అన్నారు.

తడి భూములలోకి కాల్వ సహజ ప్రవాహంలో మానవ జోక్యాన్ని గుర్తించాలని, తడి భూములను రక్షించేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. చింతకాని మండలం పైలెట్ క్రింద ఎంపిక చేసి ముందస్తుగా చిత్తడి నేలలు గుర్తించి అక్కడ పర్యావరణ పరిరక్షణకు చర్యలు చేపట్టాలని అన్నారు. నీటి వనరుల్లో ఎఫ్.టి.ఎల్, బఫర్ జోన్ సమీపంలో తడి భూములను గుర్తించాలని అన్నారు. రాబోయే మంగళవారం నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అన్నారు.

ఈ సమావేశంలో డిఆర్డిఓ సన్యాసయ్య, జిల్లా వ్యవసాయ శాఖ డి. పుల్లయ్య, డిపిఓ ఆశాలత, జిల్లా మత్స్య శాఖ అధికారి శివ ప్రసాద్, జిల్లా ఇర్రిగేషన్ అధికారి టి. వెంకట్రాం, డిప్యూటీ సిఇఓ కె. నాగపద్మజ, జిల్లా ఉద్యానవన అధికారి ఎం.వి. మధుసూదన్, ఇర్రిగేషన్ ఇఇ అనన్య, మధిర, వైరా మునిసిపల్ కమిషనర్లు ఏ. సంపత్ కుమార్, యు. గురులింగం, ఖమ్మం నగరపాలక సంస్థ హార్టికల్చర్ అధికారిణి బి. రాధిక, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.