07-11-2025 12:58:15 AM
ఇంచార్జ్ జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీజ
ఖమ్మం టౌన్, నవంబరు 6 (విజయ క్రాంతి): పోష్ చట్టం-2013, పోక్సో చట్టం-2012 చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని ఇంచార్జ్ జిల్లా కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ అన్నా రు.స్థానిక శ్రీ భక్త రామదాసు కళాక్షేత్రంలో గురువారం ప్రభుత్వ, ప్రైవేట్ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కళాశాలల ప్రిన్సిపాల్ లకు పోష్ చట్టం 20 13, పోక్సో చట్టం 2012 చట్టాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఇంచార్జ్ జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఇంచార్జ్ జిల్లా కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ మాట్లాడుతూ ఉద్యోగ స్థలాల్లో మహిళలు రక్షణ కలిగి ఉండేందుకు ’పోష్ చట్టం’ రూపొందించబడిందని, లైంగిక వేధింపులకు గురైన మహిళలు ఫిర్యాదు చేసేందుకు అంతర్గత కమిటీలు, జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పారు.లైంగిక వేధింపుల సంఘటన జరిగిన 90 రోజుల్లో విచారణ పూర్తి చేయాలని, చర్యల్లో నిర్లక్ష్యం వహిస్తే సంస్థలకు జరిమానా విధించబడుతుందని వివరించారు.
పిల్లలు లైంగిక వేధింపులకు గురి కాకుండా రక్షించేందుకు ’పోక్సో చట్టం’ రూపొందించా రని, దీని క్రింద పిల్లలపై లైంగిక వేధింపులు, దాడి, పోర్నోగ్రఫీ వంటి నేరాలకు కఠిన శిక్షలు ఉండడం, బాధిత పిల్లలకు వైద్య, మానసిక, విద్యా సహాయం అందించే బాధ్యత ప్రభుత్వానికి ఉందని తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి కె. రాంగోపాల్ రెడ్డి, డిసిపివో విష్ణువందన, జిసిడిఓ తులసి, ఏపీవో శ్రీనివాస్, బాలల సంరక్షణ జిల్లా కోఆర్డినేటర్ సమ్రీన్, జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు,అధికారులు పాల్గొన్నారు.