24-07-2024 01:40:12 AM
న్యూఢిల్లీ/హైదరాబాద్, జూలై 23 (విజయక్రాంతి): ఎన్డీయేలో ప్రధాన భాగస్వామిగా మారిన తెలుగుదేశం పార్టీ.. తన పాలనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ తాజా కేంద్ర బడ్జెట్‌లో అందరూ ఊహించినట్టుగానే భారీగా నిధులు రాబట్టగలిగింది. రాజధాని అమరావతి నిర్మాణంతోపాటు, రాష్ట్రంలో పారిశ్రామిక క్లస్టర్ల నిర్మాణం, వెనుకబడిన జిల్లాలకు నిధులు.. ఇలా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తాను కోరుకున్నవన్నీ రాబట్టుకోగలిగారు. తెలంగాణపై మాత్రం మోదీ సర్కారు ఈసారి కూడా శీతకన్నే వేసింది.
అమరావతికి రూ.15 వేల కోట్లు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.౧౫౦౦౦ కోట్లు ఇవ్వనున్నట్టు కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించారు. ఇంకా అవసరం అయితే వివిధ ఏజెన్సీల ద్వారా మరిన్ని నిధులు కేటాయించనున్నట్లు కూడా హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని హామీ ఇచ్చా రు. రాయలసీమ, ఉత్తరాంధ్రలోని వెనుకబడిన జిల్లాలలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు మంజూరు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికి ఊతమి చ్చేందుకు విద్యుత్, రైల్వే, రోడ్డు ప్రాజెక్టుల కోసం మరిన్ని నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. ఏపీ పునర్విభజన చట్టంలో ఉన్న విధంగా రాయలసీమ, కోస్తాంధ్రలోని వెనుకబడిన ప్రాంతాలకు గ్రాంట్‌లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. విశాఖ కారిడార్‌లో ఉన్న కొప్పర్తికి ప్రాధాన్యం కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణపై శీతకన్ను
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు మరోసారి కేంద్రం మొండిచెయ్యి చూపింది. పొరుగు రాష్ట్రాలతో అనుసంధానమైన ప్రాజెక్టులు తప్ప రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇచ్చింది ఏమీ లేదు. కేంద్ర బడ్జెట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నోట తెలంగాణ అనే పదం కూడా వినిపించలేదు. కానీ హైదరాబాద్ బెంగళూరు కారిడార్ ఏర్పాటు చేస్తున్నామనే సందర్భంలో తెలంగాణ రాజధాని హైదరాబాద్ పేరు మాత్రం బడ్జెట్‌లో కనిపించింది. అయితే ఈ కారిడార్ పరిధిలో ఏపీలోని రాయలసీమ ప్రాంతానికి చెందిన కర్నూలు జిల్లా ఓర్వకల్లులో పారిశ్రామిక కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర బడ్జెట్‌లో తెలిపారు. ఇందుకు ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయించనున్నట్లు ప్రకటించారు.
అయితే ఎప్పటి నుంచో బీజేపీ నేతలు చెబుతున్న హైదరాబాద్ కారిడార్‌లో తెలంగాణకు ఏం ఒరుగుతుందని రాష్ట్రానికి చెందిన పారిశ్రామిక రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో ఎప్పటి నుంచో డిమాండ్‌లో ఉన్న జడ్చర్ల పారిశ్రామిక కేంద్రానికి అనుమతి ఇచ్చి ఉంటే రాష్ట్రం అభివృద్ధికి ఊతం లభించేదని పేర్కొంటున్నారు. జడ్చర్ల సమీపంలోని పోలేపల్లి వద్ద ఇప్పటికే ఫార్మా సెజ్ విజయ వంతంగా నడుస్తోంది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 50కిలోమీటర్ల దూరంలో ఉన్న జడ్చర్లలో పారిశ్రామిక కేంద్రం వచ్చి ఉంటే అటు హైదరాబాద్ జాతీయ రహదారి, అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు సికింద్రాబాద్ డోన్ రైల్వే మార్గం ద్వారా రోడ్డు, రైల్వే, విమానయాన సేవ లు అందుబాటులో ఉండేవి. జాతీయ, అంతర్జాతీయ స్థాయి పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం ఉండేది. కానీ హైవేను కారిడార్‌గా ప్రకటించిన కేంద్రం తెలంగాణకు మాత్రం ప్రత్యేకంగా నిధులు ఇవ్వకపోవడం రాష్ట్రానికి తీవ్ర నిరాశకు గురి చేసే అంశం.
రెండు పారిశ్రామిక కేంద్రాలు రాయలసీమకే..
హైదరాబాద్ విశాఖ పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించనున్న కేంద్రం ఈ రెండు కారిడార్ల పరిధిలో మంజూరు చేసిన రెండు పారిశ్రామిక కేంద్రాలు రాయలసీమకు చెందినవే కావడం గమనార్హం. హైదరాబాద్ కారిడార్ కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఏర్పాటు చేయనున్నారు. ఇక విశాఖ చెన్నై కారిడార్‌లో ఏర్పాటు చేస్తున్న కొప్పర్తి సైతం రాయలసీమకే చెందినది కావడం విశేషం. కొప్పర్తి పారిశ్రామిక కేంద్రం వైఎస్ జగన్ హయాంలోనే ఏర్పాటు కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఇప్పు డు టీడీపీ ప్రభుత్వం వచ్చినా కూడా కొప్పర్తిలోనే ఇండస్ట్రియల్ నోడ్ రావడం గమనార్హం.
హైదరాబాద్-బెంగళూరు కారిడార్‌తో తెలంగాణ రూపురేఖలు మారుతాయి
హైదరాబాద్- బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ద్వారా ఒక్క ఏపీకే కాకుండా తెలంగాణ, కర్ణాటకకు కూడా ప్రయోజనం చేకూరుతుంది. 574 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ రెండు నగరాల మధ్య తెలంగాణలో 210 కిలోమీటర్లు, కర్ణాటకలో 94 కిలోమీటర్లు, ఏపీలో 270 కిలోమీటర్ల పరిధిలో ౪౪వ జాతీయ రహదారి విస్తరించి ఉంది. తెలంగాణ పరిధిలో పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. తప్పనిసరిగా కేంద్రం తెలంగాణను సైతం పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తుంది.
బండారి శాంతి కుమార్,
బీజేపీ రాష్ట్ర కోశాధికారి