24-07-2024 01:37:52 AM
ఢిల్లీ, హైదరాబాద్‌లో 10 గ్రాములు రూ.3 వేల దాకా పతనం
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌లో బంగారం, వెండి దిగుమతిపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించడంతో మంగళవారం బులియన్ మార్కెట్లో బంగారం , వెండి ధరలు భారీగా తగ్గాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 6 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించగానే దాని ప్రభావం మార్కెట్లో వెంటనే కనిపిపించింది. మల్టీ కమోడిటీ ఎక్స్‌చేంజిలో 10 గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.4 వేలదాకా తగ్గింది. ఆగస్టు గోల్డ్ కాంట్రాక్ట్స్10 గ్రాములు రూ.3,702 తగ్గి రూ.69,016కు చేరుకుంది. మరో వైపు కిలో వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. కిలో వెండి సెప్టెంబర్ డెలివరీ రూ.4,704 తగ్గి రూ.84,499కు దిగి వచ్చింది.
ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో సైతం మంగళవారం బంగారం ధరలు గణనీయంగానే తగ్గాయి.ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,100 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.71,010గా ఉంది. ఇక ముంబయి, హైదరాబాద్ మార్కెట్లలో 22 క్యారెట్ల బంగారం 10గ్రాములు రూ.64,950 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.70, 860గా ఉంది. 22 క్యారెట్ల బంగారంపై 10 గ్రాములకు రూ.2,750 తగ్గగా, 24 క్యారెట్ల బంగారంపై రూ.2,999 మేర తగ్గింది. కేజీ వెండి ధర రూ. 3,500 తగ్గి రూ. 88,000 కు చేరుకుంది.