18-10-2025 01:24:20 AM
గద్వాల, అక్టోబర్ 17 ( విజయక్రాంతి ) : ప్రతి మనిషి శారీరక, మానసిక ఎదుగుదలకు పౌష్టికాహారం తీసుకోవడం అత్యంత అవసరమని, ఫలితంగా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ అన్నారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు జాతీయ పోషణ మాసం సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని బాల భవన్ లో ఐసిడిఎస్ గద్వాల అర్బన్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ముగింపు కార్యక్రమం నిర్వహించగా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
అనంతరం కలెక్టర్, ఇతర అధికారులు చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం, శిశువులకు అన్నప్రాసన, గర్భిణీలకు సామూహిక సీమంతం కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే పోషణ ఆవశ్యకతను వివరించే గోడపత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా పోషణ గురించి, డ్రగ్స్ నివారణకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, జిల్లా సంక్షేమ శాఖ అధికారిని సునంద, డిఎంహెచ్‌ఓ డాక్టర్ సిద్ధప్ప, డిప్యూటీ డిఎంహెచ్ ఓ సంధ్య కిరణ్మయి, మిషన్ భగీరథ ఇంట్రా ఈఈ శ్రీధర్, డిఆర్డిఎ ఏపిడి శ్రీనివాసులు, డిపిఎం సలోమి, బాలల సంరక్షణ అధికారి నరసింహ, ఐసిడిఎస్ అధికారులు, అంగన్వాడి కార్యకర్తలు, ఇతర సిబ్బంది, తదితరులుపాల్గొన్నారు.