24-07-2025 01:12:36 AM
పేదల నుంచి రూ. 84 లక్షలు వసూలు
ఎమ్మెల్యే వివేకానంద ఆఫీసులో పనిచేసిన నిందితుడు
పోలీసులకు బాధితుడి ఫిర్యాదు.. కేసు నమోదు
కుత్బుల్లాపూర్, జూలై 23(విజయ క్రాంతి): ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వేదికగా పేదలకు డబుల్ బెడ్ రూములు ఇళ్ళు ఇప్పిస్తామని బురిడీ కొట్టించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జీడిమెట్ల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేపీ. వివేకానంద క్యాంపు కార్యాలయంలో పనిచేసే హరిబాబు పేదలను లక్ష్యంగా చేసుకొని దోపిడీకి పాల్పడ్డాడన్నారు.
ఈ స్కాములో 83 మంది బాధితులు ఉన్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పనిచేయడం అదునుగా భావించి, సొంతింటి ఇల్లే కలగా ఎదురుచూస్తున్న వారిని ఎరగా ఎంచుకొని వారి నుంచి 84 లక్షల వరకు వసూలు చేసినట్లుగా బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకే ఎమ్మెల్యే వివేకానంద్ క్యాంపు క్యారాలయంలో పనిచేసే హరిబాబును అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామన్నారు.
ఇదే డబుల్ బెడ్ రూముల స్కాములో మరో వ్యక్తి గడ్డం శ్రీధర్ ముదిరాజ్ పై సైతం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా హరిబాబును ఏడాదిన్నర క్రితమే తొలగించానని ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఒక ప్రకటనలో తెలిపారు. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఫిర్యాదులు రావడంతో తొలగించానన్నారు. బాధితులకు న్యాయం జరగడానికి తన వంతు కృషి చేస్తానని ఆయన చెప్పారు.