22-01-2026 12:44:50 AM
మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు వరంలా మారనున్న నూతన విధానం
దోమకొండ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
రోల్ కాల్, రికార్డులు పరిశీలన క్రమశిక్షణపై ప్రత్యేక దృష్టి
ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్
కామారెడ్డి అర్బన్, జనవరి 21, (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ పోలీస్ స్టేషన్ను బుధవారం జిల్లా ఎస్పి యం. రాజేష్ చంద్ర ఐపిఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్శనలో భాగంగా ఆయన ముందుగా స్టేషన్ రోల్ కాల్ను స్వయంగా పరిశీలించి, సిబ్బంది హాజరు, విధుల్లో పాటించాల్సిన క్రమశిక్షణ మరియు సమయపాలనపై అధికారులకు, సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ప్రతిరోజూ తాను టెలి-కాన్ఫరెన్స్ ద్వారా అందిస్తున్న సూచనలు మరియు మార్గదర్శకాలు క్షేత్రస్థాయిలో సిబ్బందికి ఏ మేరకు అర్థమవుతున్నాయో వారిని అడిగి తెలుసుకున్నారు.
అలాగే పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజలకు మెరుగైన సేవలందించాలని, విధుల పట్ల అంకితభావంతో ఉండాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర IPS మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ప్రజలకు మరింత సులభమైన, వేగవంతమైన సేవలు అందించేందుకు ఈ నూతన కార్యాచరణను అమలులోకి తీసుకువచ్చిందన్నారు. ఇకపై పోలీస్ స్టేషన్కు రాలేని ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న బాధితుల వద్దకే పోలీసులు వెళ్లి ఫిర్యాదు స్వీకరించి అక్కడి నుంచే కేసు నమోదు చేసి భరోసా కల్పిస్తారని తెలిపారు.
ఈ విధానం ముఖ్యంగా శారీరక దాడులు, అట్రాసిటీ నిరోధక చట్టం కేసులు, బాల్య వివాహాలు, ర్యాగింగ్, మైనర్ వేదింపులు, గృహహింస వంటి కేసుల్లో బాధితులకు ఎంతో సహాయపడుతుందని అన్నారు. ఫోన్ కాల్, ఆన్లైన్ అభ్యర్థన లేదా ఇతర మార్గాల ద్వారా సమాచారం అందగానే సంబంధిత పోలీస్ సిబ్బంది బాధితుల నివాసానికి చేరుకుని ఫిర్యాదు నమోదు చేస్తారని తెలిపారు.
ఈ సేవల ద్వారా ఫిర్యాదుల నమోదు మరింత వేగవంతమవడంతో పాటు పోలీస్ వ్యవస్థపై ప్రజల నమ్మకం మరింత పెరుగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు. అనంతరం, జిల్లా పోలీస్ కార్యాలయం నుండి జిల్లాలోని అధికారులందరితో జిల్లా ఎస్పీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ నూతన కార్యాచరణ అమలుపై పటిష్టమైన దిశానిర్దేశం చేశారు.