22-01-2026 02:06:35 AM
మరమ్మతుకు నోచుకోని రోడ్లు
కేసముద్రం, జనవరి 21 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం, ఇనుగుర్తి, నెల్లికుదురు మండలాల పరిధిలో ఉన్న పలు ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ రోడ్లు భారీ వర్షాలకు దెబ్బతిని నెలలు గడుస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారనే విమర్శలు వస్తున్నాయి. అనేక చోట్ల ఈ రెండు శాఖలకు చెందిన రోడ్లు వర్షాలకు కొట్టుకుపోవడం, కల్వర్టులు దెబ్బతినడంతో ఆయా మార్గాల్లో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. మహబూబాబాద్ జిల్లాలో 2024, 2025 వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలకు ఈ మూడు మండలాల్లోని చాలా చోట్ల గ్రామాల నుండి మండలాలకు, మండలాల నుండి జిల్లా కేంద్రానికి అనుసంధా నంగా ఉన్న పంచాయతీరాజ్ రోడ్లు దెబ్బతిన్నాయి.
వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయకపోవడంతో రెండేళ్లుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల దెబ్బతిన్న రోడ్లకు తాత్కాలికంగా మట్టి పోసి మరమ్మతులు చేసినప్పటికీ మళ్లీ వర్షాలకు దెబ్బతిన్నాయి. దీనితో ఆయా మార్గాల్లో ప్రజలు ప్రతిరోజు రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా జిల్లాలోని నెల్లికుదురు, కేసముద్రం, ఇనుగుర్తి తదితర మండలాల్లో రోడ్ల పరిస్థితి అద్వానంగా మారింది.
చెరువు మాత్తళ్లు , వాగులు ప్రవహించే మార్గానికి సమీపంలో ఉన్న రోడ్లు బాగా దెబ్బతిన్నాయని, అక్కడ ఇప్పటివరకు దెబ్బతిన్న రోడ్లకు శాశ్వత ప్రాతిపదికన పను లు చేయడం లేదని, దీనితో ఆయా ప్రాంతా ల్లో ప్రమాదకరమైన పరిస్థితిలో ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. తెగిపోయిన రోడ్లకు శాశ్వత ప్రాతిప దికన పనులు నిర్వహించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. దెబ్బతిన్న రోడ్లపై వాహనాలు నడవడానికి తీవ్ర ఇబ్బందిగా మారిందని, అలాగే పలు గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం లేదని సాకుతో ఆర్టీసీ బస్సు లు నడపడం లేదని, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని గ్రామీణ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పీ.ఎం.జీ.ఎస్.వై రోడ్ల పరిస్థితి
అదే తీరు..!
జిల్లాలోని మారుమూల గిరిజన ప్రాంతాలకు మండలాలు జిల్లాలకు మెరుగైన రవా ణా సౌకర్యం కల్పించేందుకు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం (పీ.ఎం.జి.ఎ స్.వై)లో వేసిన రోడ్ల పరిస్థితి కూడా అధ్వానంగా మారింది. మండల కేంద్రాలు, రెవెన్యూ గ్రామాల నుండి మహబూబాబాద్ జిల్లాలోని మారుమూల గిరిజన తండాలకు లక్షల రూపాయలు వెచ్చించి మెరుగైన రవాణా సౌకర్యం కల్పించారు. దీనితో గిరిజన ఆవాస ప్రాంత ప్రజలు తమకు ఇక మెరుగైన రోడ్డు సౌకర్యం ఏర్పడిందని ఎంతో సంతోషించారు. అయితే భారీ వర్షాలకు రోడ్లు అనేక చోట్ల దెబ్బతినడంతో వాటిని ఇప్పటివరకు మరమ్మతు చేసే పరిస్థితి లేకపోవడం వల్ల ఇప్పుడు మళ్లీ గిరిజనులకు సరైన రవాణా సౌకర్యం లేక పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దీనికి తోడు నిబంధనలకు విరుద్ధంగా ఆయా రోడ్లపై భారీ వాహనాలను నడపడం వల్ల జిల్లా వ్యాప్తంగా అనేక రోడ్లు అధ్వానంగా మారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధిక లోడుతో మట్టి రవాణా, గ్రానైట్ రవాణా చేస్తున్నారని, దీనితో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకంలో నిర్మించిన రోడ్లు దెబ్బతిన్నాయని, దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు.
రోడ్లకు మరమ్మతులు నిర్వహించాలి
భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు ప్రభుత్వం శాశ్వత ప్రతిపాదికన మరమ్మతులు నిర్వహించాలి. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రోడ్లు ఎంతో కీలకం. దెబ్బతిన్న రోడ్లపై ప్రయా ణం చేయడం ఇబ్బందిగా మారింది. కో మటిపల్లి నుండి ఆర్ అండ్ బిరోడ్డు వరకు పంచాయతీరాజ్ రోడ్డు పూర్తిగా పాడైపోయింది. అలాగే కోమటిపల్లి నుండి ఇనుగుర్తికి వెళ్లే మార్గంలో వర్షాలకు రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నది. ఇక కోమటిపల్లి నుండి కేసముద్రం విలేజ్ కి వెళ్లే మార్గంలో కొంతమేర పనులు పూర్తి చేయలేదు. ప్రభుత్వం స్పందించి దెబ్బతిన్న రోడ్లన్నింటికీ శాశ్వత ప్రాతిపదికగా పనులు పూర్తిచేసి రవాణా మార్గాన్ని మెరుగుపరిచి, రోడ్డు ఉన్న ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలి.
మద్దెల భిక్షపతి,
సర్పంచ్, కోమటిపల్లి