12-08-2025 01:31:01 AM
ముషీరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్)ను రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్(ఓపీఎస్)ను పునరుద్ధరించి అందరికీ అమలు చేయాలని మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. పెన్షనర్ల సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తోందని ఆరోపిస్తూ తెలంగాణ పెన్షనర్ల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈమేరకు సోమవారం ఇందిరాపార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ధర్నాకు హాజరైన మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వపెన్షనర్ల సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ కే లక్ష్మయ్య, జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, పలు పెన్షనర్ల సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ ప్రభుత్వం పెన్షనర్లతో ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి, సమస్యల పరిష్కా రానికి చొరవ చూపాలని డిమాండ్ చేశారు.
ఈహెచ్‌ఎస్ స్కీమ్ ద్వారా అన్ని కార్పొరేట్ ఆసుపత్రిలో పెన్షనర్లకు నగదు రహిత చికిత్సను వర్తింప జేయాలని, పెండింగ్ డీఏలను విడుదల చేయాలని కోరారు. గ్రంథాలయాలు, మా ర్కెట్ కమిటీల్లో సేవలందించి పదవీ విరమణ పొందన పెన్షనర్లకు ఇతర పెన్షనర్ల మాదిరి ట్రెజరర్ల ద్వారా ప్రతినెలా ఒకటో తారీఖున పెన్షన్ చెల్లించాలని విన్నవించారు. ఎన్నికలకు ముందు ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
పీఆర్‌సీ, గత ప్రభు త్వం మంజూరు చేసిన ఐఆర్‌ఆర్‌ను 5 శాతం నుంచి కనీసం 20 శాతానికి పెంచాలని కోరారు. పీఆర్‌సీ నివేదికను వెంటనే తెప్పించుకొని, 2023, జూలై నుంచి వర్తింపజే యాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇకనైనా పెన్షనర్ల సమస్యలపై నిర్లక్ష్య ధోరణిని విడనాడి మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను పరిష్కరించాలని కోరారు.
కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఏలూరు శ్రీనివాస్, సదానందం గౌడ్, దేవేందర్, సెక్రెటరీ సత్యనారాయణ, ముజీబ్, టీఎన్జీవో ఆల్ ఇండియా సెక్రటరీ సుధాకర్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మారం భరత్‌రెడ్డి, సెక్రటరీ ఓం ప్రకాశ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.