29-01-2026 12:19:27 AM
పార్టీ టికెట్ల కోసం గోడలు దూకుతున్న అభ్యర్థులు
చేరిన వారందరికీ సీటు మీకేనంటున్న కొన్ని పార్టీలు..?
మంచిర్యాల, జనవరి 28 (విజయక్రాంతి) : మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఈ నెల 30వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ ఉండటం, అదే సమయంలో ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర ‘సమ్మక్క - సారలమ్మ’ ప్రారంభం కావడంతో మున్సిపాలిటీల్లో సందడి వాతావరణం నెలకొంది. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడం, కొన్ని పార్టీలు కొన్ని డివిజన్లు, వార్డుల అభ్యర్థులకు టికెట్లు కన్ ఫాం చేయడంతో ఆశావాహులు ఇతర పార్టీల నుంచి పోటీ చేయడానికి గోడలు దూకే పనిలో పడ్డారు. ఇన్ని రోజులుగా పార్టీ తీర్థం తీసుకునేందుకు వెనుకాడిన నాయకులు ఇప్పుడు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు లైన్ లు కడుతున్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీ టికెట్లు ఆశిస్తున్న వారే అధికంగా జంప్ జలానీలుగా మారుతున్నారు.
గోడలు దూకుతున్న ఆశావహులు
మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. అదే సమయంలో అభ్యర్థులు మాత్రం తమ రాజకీయ భవిష్యత్తు కోసం ‘గోడ దూకడానికి’ సిద్ధమవుతున్నారు. నిన్నటి వరకు ఒక పార్టీ కండువా కప్పుకుని తిరిగిన నేతలు, నేడు మరో పార్టీ తీర్థం పుచ్చుకుంటూ ఓటర్లను అయోమయానికి గురిచేస్తున్నారు. టికెట్ ఆశించి దక్కని వారు అధికార, ప్రతిపక్ష పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఒకే వార్డు నుంచి ఇద్దరు, ముగ్గురు బలమైన నేతలు టికెట్ ఆశించినప్పుడు, పార్టీ ఒకరికే అవకాశం ఇస్తుంది. దీంతో భంగపడ్డ నేతలు పక్క పార్టీలోకి వెళ్లి అక్కడి నుండి పోటీకి సిద్ధమవుతున్నారు.
మరో వైపు వార్డుల రిజర్వేషన్లు మారినప్పుడు, తమకు అనుకూలమైన వార్డు కోసం లేదా వేరే చోట అవకాశం కోసం కూడా అభ్యర్థులు పార్టీలు మారుతున్నారు. మున్సిపాలిటీల్లో పనులు జరగాలన్నా, నిధులు రావాలన్నా అధికార పార్టీలో ఉండటమే మేలనే భావనతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పార్టీ మారిన అభ్యర్థులు టికెట్టు దక్కించుకోవడం కోసం పోటీపడుతున్నారు. దక్కని పక్షంలో అందులోనే కొనసాగుతారా..! జంప్ చేస్తారా..! వేచి చూడాల్సిందే.
అయోమయంలో ఓటర్లు...
జిల్లాలోని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ సహా బెల్లంపల్లి, లక్షెట్టిపేట, చెన్నూర్ వంటి మున్సిపాలిటీల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇదే సమయంలో అభ్యర్థుల ’జంపింగ్’ ధోరణితో ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు. పార్టీ సిద్ధాంతాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలకే నేతలు ప్రాధాన్యత ఇస్తున్నారని సామాన్య ప్రజలు విమర్శిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ కంటే వ్యక్తిగత సంబంధాలే ఎక్కువ ప్రభావం చూపుతాయని మరికొందరు అభిప్రాయపడుతు న్నారు. ఇది ఇలా ఉండగా ఏ రోజు ఏ నాయకుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియడం లేదని అయోమయానికి గురవుతున్నారు. కొందరైతే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నావ్, ఏ కండువా నీది అని అడుగుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
పార్టీలో చేరితే మీకే టికెట్టు...?
జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో టికెట్ ఆశావహుల సంఖ్య పెరగడంతో, పార్టీల బీ-ఫామ్ కోసం నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అధికార పార్టీలో టికెట్ దక్కని కొందరు నేతలు ప్రతిపక్షాల వైపు చూస్తుండగా, క్షేత్రస్థాయిలో బలం ఉన్న నేతలను చేర్చుకునేందుకు ఇతర పార్టీలు ద్వారాలు తెరుస్తున్నాయి. వార్డుల వారీగా రిజర్వేషన్లు మారడంతో, తమ సామాజిక వర్గానికి అనుకూలంగా లేని వార్డుల నుంచి తప్పుకుని, పక్క వార్డులో టికెట్ ఇచ్చే పార్టీలోకి చేరేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు.
ఈ క్రమంలో కొన్ని పార్టీలు తమ పార్టీ లో ఎవరు చేరినా కండువా కప్పి ఆహ్వానిం చి ఈ డివిజన్ లేదా వార్డు టికెట్టు నీకేనంటూ ఆశ పెట్టి చేర్చుకుంటున్నారు. ఇది మంచిర్యాల నియోజక వర్గంలో ఎక్కువగా జరుగుతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా టికెట్టు కావాలా నాయనా.. పార్టీ మారితే ఓకే... అన్న ప్రచారం పెద్ద మొత్తంలో జరుగుతుంది.