16-05-2025 12:00:00 AM
మునిపల్లి, మే 15 : పల్లెల్లో పాలనా వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుంది...గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం వల్ల ఎక్కడ వేసిన చెత్త అక్కడే అన్న చందంగా తయారైంది. గ్రామాల్లో పారిశుద్ధ్యం పనులు ఎప్పటికప్పుడు నిర్వహించాలని అధికారులు ఆదేశిస్తున్నా కిందిస్థాయి ఉద్యోగులు మాకేంటి అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
చెత్తను తొలగించక పోవడం వల్ల దోమలు, పందులు స్త్వ్రరవిహారం చేస్తూ రోగాలను కలిగిస్తున్నాయి. మునిపల్లి మండలం ఖమ్మంపల్లిలో చెత్త తొలగింపు చేయక పోవడంతో గుట్టలుగా పేరుకుపోతుంది. ప్రతిరోజు గ్రామంలో నెలకొన్న చెత్తను తొలగించే పంచాయతీ ట్రాక్టర్ గత పది రోజులుగా మూలన పడి వుంది. ట్రాక్టర్ డ్రైవర్ అందుబాటులో లేడని అధికారులు చెబుతున్నారు.
గతంలో ఇదే ట్రాక్టర్ మీద పనిచేస్తున్న డ్రైవర్ మద్యం మత్తులో ఓ మహిళను ఢీకొట్టడంతో మృతి చెందింది. అయితే ట్రాక్టర్ డ్రైవర్లు సరిగా పనిచేయడం లేదని, విధులకు రావడం లేదని పంచాయతీ కార్యదర్శి చెబుతున్నారు. పనిచేయని డ్రైవర్ను తొలగించి మరో డ్రైవర్ను ఏర్పాటు చేయాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో పంచాయతీ కార్యాలయంలోనే గత పది రోజులుగా నిలిచిపోయింది.
దీంతో గ్రామంలో చెత్త పేరుకుపోయింది. గ్రామంలోని పాఠశాల పక్కనే చెత్తను గ్రామస్తులు వేయడంతో మురికి కూపంగా మారి దుర్గంధం వెదజల్లుతోంది. ఈ విషయమై పంచాయతీ అధికారులకు విన్నవిస్తే పట్టించుకోవడం లేదని గ్రామస్తులు తెలిపారు. ఇప్పటికైనా పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది పట్టించుకొని గ్రామంలో పేరుకుపోతున్న చెత్తను తొలగించాలని ఖమ్మంపల్లి గ్రామస్తులు కోరుతున్నారు.