calender_icon.png 17 May, 2025 | 6:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘బెల్టు’ తీయలేదా..?

17-05-2025 12:00:00 AM

- పెచ్చురిల్లుతున్న బెల్ట్ షాపుల దందా                                               

- మోతే మండలంలో గ్రామానికి 10కి పైనే బెల్టు షాపులు

- ఒక్కో సీసాపై రూ.50 అదనపు భారం

- ఖాళీ సీసాలు పగలగొట్టి పాఠశాలలు, పొలాలలో వేస్తున్న వైనం

- ఎక్సైజ్ అధికారుల తీరుపై ఆరోపణలు

-బెల్ట్ షాపులను నిర్మూలించాలంటూ ప్రజల వేడుకోలు

మోతే, మే 16 : మోతే మండలంలో 29 గ్రామాల్లో బెల్ట్ షాపుల దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది. బడి, గుడి అనే తేడా లేకుండా ప్రతి గ్రామంలో 10 బెల్ట్ షాపులకు పైబడి నిర్వహిస్తున్నారు. మండల కేంద్రంలో ఉన్న రెండు లైసెన్స్ పొందిన దుకాణాల నుంచి మద్యం తీసుకొచ్చి గ్రామాల్లో ఒక్కో బీరుకు, క్వార్టర్ కు ఎమ్మార్పీ కంటే 50 రూపాయల పైబడి విక్రయాలు జరుపుతున్నారు.

ఇదేమిటని ఆయా గ్రామాల ప్రజలు నిర్వాహకుల ను నిలదీస్తే మీరు ఎక్కడైనా ఏమైనా చెప్పుకోండి ఫిర్యాదులు చేసుకోండి మాకు ఎక్సైజ్ అధికారుల మద్దతు, అనుమతులు పొందిన దుకాణాల యాజమాన్యం అండదండలు ఉన్నాయనే సమాధానాలు వస్తున్నాయంటూ మండల ప్రజలు చెప్పుకుంటున్నారు. గ్రామాల్లో అధిక ధరలకు మద్యం  విక్రయిస్తున్నారని ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదులు చేస్తే ఫిర్యాదులు చేసిన వారి వివరాలను రికార్డులు చేసి ఆయా బెల్ట్ షాపుల నిర్వాహకులకు అందజేస్తున్నట్లు సమాచారం.

ఈ కారణం చేతనే పలుసార్లు మండలంలో ఘర్షణలు చోటు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. నామవరం, సిరికొండ, రావిపహాడ్, మోతే, మామిళ్లగూడెం, తుమ్మలపల్లి, గ్రామాల్లో బడి, గుడికి ఆనుకొని ఎదురుగా ఉన్న ప్రదేశాల్లో బెల్ట్ షాపులు  లైసెన్సుడ్ షాపుల కంటే పెద్ద ఎత్తున సిట్టింగ్ ఏర్పాటుచేసి ఎంత స్వేచ్ఛగా విక్రయాలు జోరుగా సాగిస్తున్నారనే విషయం ఆ గ్రామాల్లోకి వెళితే అర్థమవుతుంది.

సీసాలు పగలకొట్టి ఇబ్బందులకు గురి చేస్తూ...  : గ్రామాలలో మద్యం తాగిన మద్యం ప్రియులు ఖాళీ సీసాలను ఎదురుగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో పగలగొట్టి  విద్యార్థులకు ఇబ్బందులు కలిగించిన సంఘటనలు అనేకం ఉన్నాయి. వీటికి తోడు ఈ బెల్డు షాపులలో మద్యం సేకరించి గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ భూముల వెంబటి తాగి సీసాలను పగలగొట్టి పొలాలలోకి రోడ్ల వెంబడి విసిరేస్తున్నారు. దీంతో పొలాలకు వెళ్లిన రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదులు  చేసిన ప్రయోజనం లేకుండా పోతుంది. గత సంవత్సర కాలంగా మండలం నుండి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన ఎక్సైజ్ అధికారుల చర్యలు మాత్రం శూన్యం అనే విషయం మండల ప్రజల నుండి స్పష్టమవుతుంది.  

ఒక్కో సీసాపై రూ.50 అదనం 

ప్రస్తుతం వేసవికాలం కావడంతో గ్రామాల్లోనీ బెల్ట్ షాపుల్లో ఒక్కో బీరు సీసాపై 50 రూపాయలు పైబడి అమ్ముతున్నారని మద్యం ప్రియుల ద్వారా తెలుస్తుంది. ఒక్కో బెల్ట్ షాపు నిర్వాహకుడు అధికదరలకు మద్యం విక్రయిస్తూ లక్షల్లో సంపాదిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

తండాల్లో సారాయి విక్రయిస్తున్న వారి పైన వెంటబడి చర్యలు చేయబడుతున్న ఎక్సైజ్ అధికారులు కళ్లకు కనిపిస్తున్న బెల్ట్ షాపులపై వీరు ఏమాత్రం చర్యలు తీసుకోకపోవడంతో నెలవారి మామూళ్ళు అందుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. గ్రామాలలో బెల్ట్ షాపులు నిర్వహిస్తుండడంతో యువత పెడదారి పట్టడానికి అవకాశం ఉండడంతో పాటు, మద్యం ప్రియులపై అధిక భారం పడుతున్నందున ఇప్పటికైనా ఎక్సైజ్, పోలీస్ శాఖ అధికారులు బెల్ట్ షాపుల నిర్వాహకుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.  

మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం                       

మండలంలో బెల్టు షాపులు నిర్వహిస్తున్నారని, అందులో అధిక ధరలకు మద్యం అమ్ముతున్నట్టు మా దృష్టికి వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ నిబంధనలను ఎవరు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయి.

 సురేందర్, ఎక్సైజ్ ఎస్‌ఐ, సూర్యాపేట