calender_icon.png 17 May, 2025 | 7:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హరీశ్‌రావుతో కేటీఆర్ భేటీ

17-05-2025 12:22:52 AM

  1. అనారోగ్యంతో ఉన్న హరీశ్ తండ్రిని పరామర్శించిన కేటీఆర్
  2. అనంతరం రాష్ట్ర రాజకీయాలపై రెండు గంటల పాటు సుదీర్ఘ చర్చ
  3. పార్టీ పగ్గాలపైనే మాట్లాడారంటూ టాక్
  4. గులాబీ లీడర్లలో గుబులురేపుతున్న కవిత కామెంట్స్

హైదరాబాద్, మే 1౬ (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావును శుక్రవారం ఆయన ఇంటికెళ్లి కలిశారు. అనారోగ్యంతో ఉన్న హరీశ్‌రావు తండ్రిని పరామర్శించారు. అనంతరం వీరిద్దరూ రాష్ట్ర రాజకీయాలపై దాదాపు రెండు గంటలపాటు చర్చించినట్టు తెలుస్తోంది.

రెండు రోజుల క్రితం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు పార్టీ పగ్గాలు అప్పగిస్తే క్రమశిక్షణ ఉన్న కార్యకర్తలా, ఆ నిర్ణయాన్ని శిరసావహిస్తానని స్పష్టం చేశారు. అధినేత కేసీఆర్ అప్పగించిన ఏ బాధ్యతనైనా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.

హరీశ్ రావు కామెంట్ చేసిన 48 గంటల్లోనే కేటీఆరే స్వయంగా హరీశ్‌రావు ఇంటికెళ్లడం రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది. తన కుమారుడి గ్రాడ్యుయేషన్ సెర్మనీకి ఎమ్మెల్సీ కవిత అమెరికాకు వెళ్తున్న రోజే వీరు భేటీ అవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.

కారు స్టీరింగ్ కోసం పోరు..

కారు పార్టీలో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరినట్టు వార్తలొచ్చాయి. ఎల్కతుర్తి రజతోత్సవ సభ పర్యవేక్షణ బాధ్యతను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, ముందుగా హరీశ్‌రావుకు అప్పగించారు. తర్వాత ఆయన్ను ఆ బాధ్యతనుంచి తప్పించి కేటీఆర్, కవిత సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే హరీశ్ రావు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ రోజు తప్పితే, ఏర్పాట్లను సైతం సమీక్షించలేదు.

ఈ నేపథ్యంలో కారు స్టీరింగ్ కోసం బీఆర్‌ఎస్‌లో ఆధిపత్య పోరు పెరిగిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. హరీశ్‌రావు పార్టీ మారుతారని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో తాను పార్టీ మారుతానంటూ వస్తున్న వార్తలను హరీశ్‌రావు కొట్టిపారేశారు. కేటీఆర్ నాయకత్వానికి జై కొట్టడంతో తాజా భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. 

గుబులు రేపుతున్న కవిత వ్యాఖ్యలు

బీఆర్‌ఎస్ ముఖ్య నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతున్నాయి. మేడే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను భౌగోళికంగా సాధించినా, ప్రజలకు సామాజిక న్యాయం అందలేదన్నారు. భూమి ఉన్న వారికి రైతుబంధు ఇచ్చినా, భూమిలేని వ్యవసాయ కార్మికులకు న్యాయం జరగలేదన్నట్టు మాట్లాడారు.

ఈ వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలు యథాలాపంగా చేశారా? లేక రాజకీయ పరమైనవా? అని గులాబీ పార్టీతో పాటు రాజకీయవర్గాల్లోనూ చర్చ నడుస్తోంది. ఇటీవల మీడియా వర్గాలతో ఇష్టాగోష్ఠిగా కవిత మాట్లాడుతూ తనపై పనిగట్టుకొని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, సమయం వచ్చినప్పుడు అన్నీ బయటపెడుతానన్నారు.

తాను ఆర్నెళ్లు జైలులో ఉన్నది సరిపోదా ఇంకా కష్టపెడతారా? అంటూ చేసిన వ్యాఖ్య లు ఎవరిని ఉద్దేశించి చేశారన్న చర్చ సాగుతోంది. కవిత కామెంట్లు రాజకీయంగా ఎటు వంటి పరిణామాలకు దారితీస్తాయో చూడాలి.