11-09-2025 01:18:48 AM
ప్రజా సమస్యల పరిష్కారానికై ఎమ్మెల్యే శ్రీగణేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): కంటోన్మెంట్ ప్రజల సమస్యల పరిష్కారానికై ఎమ్మెల్యే శ్రీగణేష్ ‘కంటోన్మెంట్ వాణి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బుధవారం బోయిన్‌పల్లి కంటోన్మెంట్ ప్లే గ్రౌండ్‌లో ఎమ్మెల్యే శ్రీగణేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కంటోన్మెంట్ వాణి కార్యక్రమంలో నుంచి రెవెన్యూ, సివిల్ సప్లై, ఎలక్ట్రిసిటీ, హెల్త్, పోలీస్, ఫారెస్ట్ శాఖల అధికారులు, కంటోన్మెంట్ బోర్డు నుంచి సిఇఓ మధుకర్ నాయక్, వాటర్ వర్క్స్, హెల్త్‌చ శానిటేషన్, ఎలక్ట్రిసిటీ, ఇంజనీరింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.
నియోజకవర్గ చరిత్రలో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం, కంటోన్మెంట్ బోర్డు అధికారులు ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఒకే వేదిక వద్దకు రావడంతో నియోజకవర్గంలోని అన్ని వార్డుల ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. వారి సమస్యలను ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది రికార్డు చేసుకుని అధికారులకు అందజేశారు.
ఈ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఎమ్మెల్యే శ్రీగణేష్ అధికారులకు సూచించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. “కంటోన్మెంట్ వాణి కార్యక్రమం నియోజకవర్గంలో చరిత్రలో నిలిచిపోతుంది. నన్ను ఆశీర్వదించి గెలిపించిన ప్రజలకు నా బాధ్యతగా ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టాను. కంటోన్మెంట్ కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్న సీఈవో మధుకర్ నాయక్ గారికి ధన్యవాదాలు” అని చెప్పారు.