calender_icon.png 14 November, 2025 | 3:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాచిగూడలో కారు కలకలం

14-11-2025 12:00:00 AM

  1. రైల్వే బ్రిడ్జి కింద గంటల తరబడి నిలిపిన కారుతో హైడ్రామా

ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో పోలీసుల అప్రమత్తం

బాంబ్, డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు

ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారణ

బాలాజీ అనే వ్యక్తి పేరుతో కారు రిజిస్టర్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 13 (విజయక్రాంతి): హైదరాబాద్ కాచిగూడలో రైల్వే ట్రాక్ కింద గురువారం అనుమానాస్పదంగా పార్క్ చేసిన కారు తీవ్ర కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తి కారును రైల్వే బ్రిడ్జి కింద వదిలి వెళ్లడంతో ఆందోళన నెలకొంది. ఢిల్లీ పేలుళ్ల ఘటన నేపథ్యంలో పోలీసులు, రైల్వే అధికారులు అప్రమత్తమై బాంబ్, డాగ్ స్క్వాడ్లతో విస్తృత తనిఖీలు చేపట్టారు.

ఎలాంటి ప్రమాదకర వస్తువులు లేవని నిర్ధారించుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాచిగూడ రైల్వే బ్రిడ్జి కింద గంటల తరబడి ఓ కారు అనుమానాస్పదంగా నిలిపి ఉండటాన్ని గమనించిన స్థాని కులు, పోలీసులకు సమాచారం అందించారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన పేలుళ్ల నేపథ్యంలో దేశవ్యాప్తంగా హై అలర్ట్ కొనసాగుతున్నందున, పోలీసులు అప్రమత్తమ య్యారు.

హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. రైల్వే ట్రాక్ సమీ పంలో ఆంక్షలు విధించి, వాహన రాకపోకలను నియంత్రించారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లను రప్పించి కారును, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కారులో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవ ని, అనుమానాస్పద వస్తువులు ఏమీ లభ్యం కాలేదని నిర్ధారించుకున్న తర్వాత, అధికారులు, స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే విచారణలో కారు రైల్వే ట్రాక్‌పై కాకుండా, ట్రాక్ వెళ్తున్న బ్రిడ్జి కింద పార్క్ చేసి ఉందని తేలింది.

అయితే ఎక్కువ సేపు అక్కడే ఉండటంతో గందరగోళం నెలకొందని పోలీసులు తెలిపారు. కారు రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా, అది బాలాజీ అనే వ్యక్తి పేరు మీద రిజిస్టర్ అయి ఉన్నట్లు గుర్తించారు. కారును అక్కడ ఎందుకు వదిలి వెళ్లారు.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలాజీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం అక్కడ ఎలాంటి సమస్యా లేదని, పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు స్పష్టం చేశారు.