calender_icon.png 31 December, 2025 | 8:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ఎన్నికలకు వార్డుల మ్యాపింగ్ చేయండి

31-12-2025 12:12:55 AM

కలెక్టర్ ఆదర్శ్ సురభి 

వనపర్తి టౌన్, డిసెంబర్ 31: త్వరలో జరుగబోయే పురపాలికల ఎన్నికల నిర్వహణకు వార్డుల మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.మంగళవారం కలెక్టర్ తన ఛాంబర్‌లో  పురపాలికల ఎన్నికలపై మున్సిపల్ కమిషనర్లు, మేనేజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పురపాలికల్లో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీస్ విడుదల చేసిందని దానికి అనుగుణంగా జనవరి 1వ తేది నాడు మున్సిపల్ వార్డు వారిగా ముసాయిదా ఎలక్టరల్ రోల్ జాబితా విడుదల చేయాల్సి ఉంటుందని తెలియజేశారు.

అసెంబ్లీ నియోజకవర్గం వారిగా ఉన్న ఎలక్టరల్ రోల్ ను పార్ట్ వారిగా ఒక్కో మున్సిపల్ వార్డులో ఎన్ని పార్టులు వస్తున్నాయి, అందుకొని ఇంటి నెంబర్లూ, ఓటర్లను గుర్తించి మ్యాపింగ్ చేయాల్సి ఉంటుందన్నారు.  జనవరి ఒకటవ తేదీన ప్రకటించిన ముసాయిదా ఓటరు జాబితా, వార్డులో అసెంబ్లీ ఉప విభాగాల వివరాల ఆధారంగా ప్రజల నుండి వచ్చే అభ్యంతరాలను జనవరి 5 నుంచి  స్వీకరించి పరిష్కరించిన, తప్పులు లేని తుది ఓటరు జాబితాను జనవరి 10వ తేదీన ప్రకటించాలని సూచించారు. జనవరి 10న ప్రకటించే తుది ఓటరు జాబితా ఆధారంగా మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుందన్నారు.

జనవరి, 5వ తేదీన ప్రముఖ రాజకీయ పార్టీల ప్రతినిధులతో మున్సిపల్ కమిషనర్లు సమావేశాలు నిర్వహించి వారికి వార్డుల వివరాలు తెలిపి అభ్యంతరాలను తీసుకోవాలని,జనవరి 6వ తేదీన కలెక్టర్ స్థాయిలో కలెక్టరేట్ లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.వార్డుల మ్యాపింగ్ తప్పులు లేకుండా పకడ్బందీగా సిద్ధం చేస్తే ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించుకోవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, మున్సిపల్ కమిషనర్లు, మేనేజర్లు, సి సెక్షన్ సూపరింటెండెంట్ మదన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.