18-10-2025 07:55:10 PM
- ఎటువంటి అనుమతి పత్రాలు లేవు
- మంగపేట ఎస్సై టివిఆర్ సూరి
మంగపేట,(విజయక్రాంతి): మంగపేట మండల కేంద్రంలో ఎవరైనా దీపావళి (బాంబులు) పటాసుల వ్యాపారాలు కొనసాగించాలంటే ప్రభుత్వం, సంబంధిత అధికారుల నుండి అనుమతి పత్రాలు పొంది వ్యాపారం చేసుకోవచ్చని పోలీసు వారు ఇదివరకే ఒక ప్రకటనలో తెలిపారు. అందుకు భిన్నంగా కమలాపురం గ్రామానికి చెందిన తాటిపల్లి రాజేందర్ ఎలాంటి అనుమతి పత్రాలు తీసుకోకుండా ఆంధ్రాలోని చిలకలూరిపేట నుండి దీపావళి పటాసులు అక్రమంగా కొనుగోలు చేసి జనావాసాల మధ్య నిల్వ ఉంచారు.
కమలాపురంలో శుక్రవారం సాయంత్రం పోలీసులు సోదాలు నిర్వహిస్తుండగా తాటి రాజేందర్ ఇంటిలో సుమారు 1,89,265/- విలువచేసే దీపావళి పటాసులను పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. దీపావళి పటాసుల అక్రమ వ్యాపారిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై టివిఆర్ సూరి మాట్లాడుతూ మండలంలో అనుమతి లేకుండా దీపావళి పటాసులను అమ్మిన నిలువ ఉంచిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.