24-01-2026 07:28:36 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంబర్ పెట్ గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా గ్రామపంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన 18 నూతన సీసీ కెమెరాలను శుక్రవారం ఉదయం 11 గంటలకు ఏఎస్పీ బి. చైతన్య రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భిక్నూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సంపత్ కుమార్, దోమకొండ ఎస్సై ప్రభాకర్, మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ), గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, 12 మంది వార్డ్ మెంబర్లు పాల్గొనగా, గ్రామానికి చెందిన సుమారు 100 మంది ప్రజలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏఎస్పీ బి. చైతన్య రెడ్డి మాట్లాడుతూ, నూతన పాలకవర్గం బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రజా భద్రతకు ఉపయోగపడే సీసీ కెమెరాల ఏర్పాటు స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. సీసీ కెమెరాలు నేరాల నివారణలో కీలక పాత్ర పోషిస్తాయని, దొంగతనాలు, చైన్ స్నాచింగ్, వాహనాల దొంగతనాలు వంటి నేరాలను అడ్డుకోవడంలో సహాయపడతాయని తెలిపారు. ఏదైనా నేరం జరిగినా సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా నిందితులను త్వరగా గుర్తించవచ్చని పేర్కొన్నారు. అంబర్పేట్ గ్రామం ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోందని, ప్రతి గ్రామం కూడా ఇలాంటి ఏర్పాట్లు చేసి పోలీసులకు సహకరించాలని కోరారు.