24-01-2026 07:23:14 PM
రాయితీ పథకాలను ఎత్తేసిన ఘనత బిఆర్ ఎస్ పార్టీ ది
రూ. 77 లక్షల 13 వేల రూపాయల రాయితీ ఉపకరణాల పంపిణీ
రైతులకు రాయితీ ఉపకరణాల పంపిణీ కార్యక్రమం
వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి
వనపర్తి,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి రైతు పక్షపాతిగానే పనిచేస్తుందని రైతు రుణమాఫీ, రాయితీపై వ్యవసాయ పనిముట్ల పంపిణీ, రాయితీపై విత్తనాల పంపిణీ, ఎరువుల పంపిణీ, డ్రిప్పు పైపుల పంపిణీ, స్పింకులర్ల పంపిణీ, ట్రాక్టర్ల పంపిణీ, కల్టివేటర్లు, రోటవేటర్లు మందుల పిచికారి యంత్రాలు లాంటి అనేక ఉపకరణాలను రాయితీపై అందిస్తుందని వీటి ద్వారా రైతులకు దాదాపు రూ.20వేల నుంచి 50 వేల రూపాయలు వరకు లబ్ధి చేకూరుతుందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు.
శనివారం వనపర్తి మండలం రైతు వేదికలో ఏర్పాటు చేసిన రైతులకు రాయితీపై వ్యవసాయ ఉపకారణాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత 10 ఏళ్ల బి ఆర్ ఎస్ పాలనలో పాలకులు రైతుల పేరున అనేక మోసాలు చేశారని, అందుకు నిలువెత్తు సాక్ష్యమే ఈ రాయితీ వ్యవసాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమంను ఎమ్మెల్యే చెప్పారు. కేవలం రైతుబంధు పేరుతో రైతులకు లక్షల రూపాయలు ఆదా అయ్యే ఇలాంటి వ్యవసాయ ఉపకరణాలపై రాయితీలను ఎత్తేసి కేవలం రైతుబంధు పేరుతో ఆడంబరాలు ప్రచారాలు చేశారే తప్ప వారు రైతులకు చేసింది ఏమీ లేదని ఆయన విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మొదటినుంచి అన్నదాతల ఉపయోగార్థం కట్టిన ఎన్నో ప్రాజెక్టుల నుంచే నేటికి రైతులకు సాగునీరు అందుతుందని కేవలం కాలువలకు బొక్కలు పెట్టి మేము సాగునీరు తీసుకొచ్చామని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. గతంలో నిర్మించిన ప్రాజెక్టులకు బొక్కలు పెట్టి నీళ్లు తెచ్చామని పూలు చల్లిన నాయకులు రైతుల గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. రైతులకు రుణమాఫీ విషయంలో పదేళ్ల కలలో లక్ష రూపాయల రుణమాఫీ చేయని వ్యక్తులు నేడు రుణమాఫీ గురించి అనవసరమైన మాటలు మాట్లాడడం విడ్డూరమన్నారు. రైతుల సౌకర్యార్థం వేలాడుతున్న విద్యుత్ తీగలు, స్తంభాలను, నియంత్రికులను ఇటీవల 50 కోట్ల రూపాయలు మంజూరు చేయించి సరి చేయించడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు.
జిల్లాల పునర్వ్యవస్థీకరణకు, రద్దుకు తేడా తెలియని కొందరు నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, ఒక్కో జిల్లా పరిధిలో మూడు నాలుగు నియోజకవర్గాలు కలిసి ఉండే పరిపాలన విధానానికి ఇబ్బందిగా ఉండడంతో అలాంటి జిల్లాలను పునర్వ్యవస్థీకరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అవగాహన లేని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారిని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. వనపర్తి వేరుశనగ పంటకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉందని ఇందుకు సంబంధించి వేరుశనగ పరిశోధన కేంద్రాన్ని గతంలో పెద్దమందడి మండలం వీరాయపల్లి గ్రామంలో నిర్మించ తలపెట్టామని వీటి పనులం కూడా అతి త్వరలోనే వేగవంతం చేయనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
వేరుశెనగ పరిశోధన కేంద్రానికి సంబంధించిన పనులు నేను చేస్తే కొందరు సన్నాసులు వాటిపై కూడా బిల్లులు చేసుకుని తిన్నారని ఆయన ఎద్దేవ చేశారు. వేరుశనగ పంట కాపాడుకునేందుకు రైతులు రాత్రింబవళ్లు తీవ్ర ఇబ్బందులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇట్టి విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పంట పొలాలకు 50 శాతం రాయితీతో కంచ నిర్మాణం చేయించేందుకు తాను బాధ్యత తీసుకుంటానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, వనపర్తి మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, ఖిల్లా ఘణపురం సింగిల్ విండో అధ్యక్షులు మురళీధర్ రెడ్డి, డైరెక్టర్ సాయి చరణ్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ శారద, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.