03-08-2025 01:04:20 AM
సవరణతోనే బీసీల ఆకాంక్షలు సాకారం
పోరాటస్ఫూర్తిని నింపేందుకు ‘ఓబీసీ
పదేళ్లలో 8 రాష్ట్రాల్లో రిజర్వేషన్ పెంపుపై నిర్ణయాలు
కానీ ఏ రాష్ట్రంలోనూ సాకారం కాలేదు
-కొన్ని వర్గాలకే రాజకీయ గుత్తాధిపత్యం
-తెలంగాణలో చేసిన సర్వేను స్వాగతించాల్సిందే
-బీసీలను పట్టించుకోని పార్టీలకు మద్దతు ప్రశ్నార్థకం
-ఇప్పటి వరకు చట్టసభలకు వెళ్లిన బీసీలు 19 శాతమే
-చట్ట సభల్లో నిలవాలంటే శాస్త్రీయ సమాచారం అవసరం
-రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం
-ఐఏఎస్ పీ నరహరి
హైదరాబాద్, ఆగస్టు 2 (విజయక్రాంతి): దశాబ్దాలుగా సాగుతున్న బీసీ రిజర్వేషన్ సా ధన ఉద్యమానికి తెలంగాణలో జరిగిన కులగణన, రాష్ట్ర ప్రభుత్వం చేసిన బీసీ రిజర్వేషన్ బిల్లు, ప్రత్యేక ఆర్డినెన్స్ ఆజ్యం పోసింది. బీసీ ఉద్యమానికి దేశవ్యాప్తంగా చలనం వచ్చిం ది. బీసీ ఉద్యమానికి తెలంగాణతో కలిసి నడిచేందుకు అందరూ ముందుకొస్తున్నారు.
ఈ క్రమంలో బీసీ, ఓబీసీ ఉద్యమ భూమికలో ఒక వ్యక్తి పేరు ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాలి. ఒకవైపు ఐఏఎస్‌గా ప్రభుత్వంలో కీలక విధుల్లో భాగస్వామ్యమవుతూ నే బీసీల్లో సామాజిక చైతన్యం నింపేందుకు కృషిచేస్తున్నారు. ‘ఓబీసీ పోరుబాట’ పుస్తకాన్ని రాసి ఆయా సామాజికవర్గాల్లో పోరా ట స్ఫూర్తిని నింపుతున్నారు. ప్రస్తుతం బీహార్‌లో పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెం ట్‌లో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్న తె లంగాణకు చెందిన ఐఏఎస్ అధికారి పీ నరహరితో విజయక్రాంతి స్పెషల్ ఇంటర్వ్యూ..
సమాజంలో అందరికీ అవకాశాలు వచ్చే లా నిర్ణయాలు జరగాలి. ఆ దిశగా ప్రభుత్వా లు ప్రయత్నించాలి. బీసీ ఉద్యమానికి కావాల్సిన ముడిసరుకు సమాజంలో తయారైంది. యువ భారతదేశంలో బీసీల ఆకాంక్షలను సాకారం చేసుకునే ఆలోచన విధానం పెరిగి దావానలం మారుతున్న ది. ఆ దిశగా ఉద్యమాలు మరింత ఉధృతమ య్యే సూచనలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఈ పరిస్థితిని అన్ని ప్రభు త్వాలు, రాజకీయ పార్టీలు గుర్తించి అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. రిజర్వేష న్‌పై చట్ట సవరణతోనే బీసీల ఆకాంక్షలు సాకారమవుతాయి.
ఓబీసీల పోరుబాట పుస్తకం రాయడానికి కారణం యావత్ భారతదేశంలో, ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రా ల్లో అత్యంత ఆకాంక్షతో కూడిన సామాజికవర్గం బీసీ సామాజికవర్గం. 1990 మండల్ కమిషన్ సిఫారసుల అమలు ద్వా రా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో బీసీలకు, ఓబీసీలకు విద్య, ఉద్యోగ అవకాశాలు కొంత మేర లభించాయి. కానీ బీసీలకు కేంద్ర, రా ష్ట్ర ప్రభుత్వాలు ఇంకా అన్యాయం చేస్తున్నా యి. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని యూనివర్సిటీల్లో ఇప్పటికీ 27 శాతం రిజర్వేషన్ అమ లు కావడం లేదు. దీంతోపాటు ఇప్పటికీ బీసీలు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉండటం ఒక ఎత్తు అయితే, రాజకీయంగా బీసీలకు తగిన ప్రతిఫలాలు అందడం లేద న్న భావన దేశవ్యాప్తంగా ఉంది. తెలుగు రాష్ట్రాల బీసీలే అత్యధికంగా ఉన్నారు.
ఏ రాష్ట్రంలోనూ సాకారం కాలేదు..
తెలంగాణ ప్రభుత్వం బి ల్లు చేసిన తరహాలోనే గత పదేళ్లలో 8 రాష్ట్రాలు కూడా చట్టాలను తీసుకొచ్చాయి. కానీ ఆ రాష్ట్రాల్లో చట్టాలు సాకారం కాలేదు. అయితే రాష్ట్రాలు పంపించే ఈ రకమైన బిల్లుపై ఒక రాష్ట్రానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోదు. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై సమగ్రంగా, కూలంకషంగా చర్చించి నిర్ణయం తీసుకుంటుంది. ఈ క్రమంలో తెలంగాణ తీసుకెళ్లిన బిల్లులను షెడ్యూల్ 9లో పెడుతుందా అని ఆలోచించాలి. గతంలో ఇందిరా సహానీ కేసు సందర్భంగా 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయకూడదని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.
దాన్ని అతిక్రమించేలా ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా అవి కోర్టులో నిలవలేకపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ తీసుకొచ్చిన బిల్లు నిలు స్తుందా అన్నది ప్రశ్నార్థకం. అయితే బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నప్పుడు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసేం దుకు ప్రత్యేకమైన ఆర్డినెన్స్ తీసుకురావడం చాలా మంచి ఆలోచన. కానీ రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని సుప్రీం కోర్టు తీర్పు ఉన్న నేపథ్యంలో దానిపై ముందు నిర్ణయా లు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రిజర్వేషన్లపై ఉన్న సీలింగ్‌ను తొలగించకుండా ఎన్ని బిల్లులు, ఆర్డినెన్స్‌లు తీసుకొచ్చినా లాభం లేదు. ప్రభుత్వం నుంచి సానుకూల ధోరణి ఉన్నా నిర్ణయాత్మక అమలు దిశగా వెళ్లకపోవడం బాధాకరం.
అన్ని రాష్ట్రాల్లోనూ రిజర్వేషన్ల డిమాండ్
ప్రస్తుతమున్న యువ భారతదేశంలో యువ బీసీలందరూ గొప్ప ఆశతో చూస్తున్నారు. ఇదొక చారిత్రక అవకాశంగా భావిం చాలి. రిజర్వేషన్లపై ఉన్న గ్లాస్ సీలింగ్‌ను బద్ధలు కొట్టాల్సిన సమయం ఆసన్నమైంది. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రా జ్యాంగ సవరణ తీసుకురావాల్సిన అవసరముంది. అన్ని రాష్ట్రాల కోసం ఒకే విధంగా ఆలోచించి సమగ్రంగా రాజ్యాంగ సవరణ చేయాలి. రాజ్యాంగ సవరణతోనే బీసీల ఆ కాంక్షలు సాకారమవుతాయి.
రిజర్వేషన్ కావాలని అన్ని రాష్ట్రాలూ కోరుతున్నాయి. ఇది కేవలం ఒక రాష్ట్రం సమస్య కాదు. ఈ నేపథ్యంలో అందరికీ ఆమోద యోగ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన తక్షణ అవసరం ఏర్పడింది. ఎస్సీ, ఎస్టీలకు దామాషా ప్రకా రం రిజర్వేషన్ అమలవుతుంది. వారికెలాం టి సమస్య లేదు. కానీ బీసీలకు దామా షా ప్రకారం రిజర్వేషన్ లభించడం లేదు. దా మాషా ప్రకారం రిజర్వేషన్ల అమలుకు చట్టా లు చేసి రాజ్యాంగ సవరణ చేస్తే భవిష్యత్‌లో కూడా ఎలాంటి సమస్యలు తలెత్తవు. ప్రస్తు తం చేస్తున్న ఉద్యమాల అవసరం ఉండదు.
చట్టసభలకు 19 శాతమే..
మధ్యప్రదేశ్‌లో విద్య, ఉద్యోగాల్లో బీసీలకు కేవలం 14 శాతం రిజర్వేషన్ మాత్రమే ఉన్నది. మొత్తం 50 శాతం రిజర్వేషన్లలో 36 శాతం ఎస్సీ, ఎస్టీలకు ఉన్న నేపథ్యంలో బీసీలకు మిగిలింది 14 శాతమే. అయితే దానిని 27 శాతం చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో 35 శాతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రిజర్వేషన్ పెరగడం ద్వారా విద్య, ఉద్యోగ, స్థానిక ఎన్నికల్లో బీసీలకు లాభం చేకూరుతుంది. చట్టసభల్లో కూడా రిజర్వేషన్ పెంపు ప్రకారం బీసీలకు ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ అధికంగా పెరుగుతున్నది.
1983 నుంచి 2023 వరకు అన్ని ఎన్నికల్లో కలిపి కేవలం 19 శాతం బీసీలు మాత్రమే చట్టసభలకు వెళ్లారు. 52 శాతం ఉన్న బీసీల నుంచి కేవలం 19 శాతం మాత్రమే ఎన్నిక కావడానికి రాజకీయ పార్టీ లూ కారణమే. చట్టసభల్లో తక్కువ ప్రాతినిధ్యం ఉంటే బీసీల గురించి కొట్లాడేదెవరనే భావన బీసీ యువతలో వస్తున్నది. చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం లేకపోతే బీసీల ఆ కాంక్షలు ఎలా నెరవేరుతాయి. జనగణనలో కులగణన జరిగిన తర్వాత వెంటనే మహిళా రిజర్వేషన్ అమలవుతుంది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీలకు చట్ట సభల్లో రిజర్వేషన్ ఉంది. మరి ఓబీసీలకు ఎందుకు రిజర్వేషన్ ఉండకూడదు. ఈ దిశగా కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు దృష్టి సారించి చట్టసభల్లో కూడా ఓబీసీ రిజర్వేషన్ అమలు చేయాలి.
పార్టీ తరఫున ఇచ్చినా చట్టబద్ధత కావాలి..
పార్టీ తరఫున బీసీలకు 42 శాతం టికెట్లు ఇవ్వడానికి అడ్డంకులేం ఉంటాయి. ఏ పార్టీ అయినా అలా ఇవ్వొచ్చు. కానీ అది న్యాయబద్ధమైనది కాదు. పార్టీ తరఫున ప్రకటించ డం మంచిదే. దానికి ఎలాంటి చట్టాలు అవసరం లేదు. రాజకీయ పార్టీలు ఇలాంటి నిర్ణ యాలు ఎప్పుడో తీసుకోవాల్సింది. కానీ బీ సీలకు కావాల్సింది చట్టబద్ధమైన నిర్ణయా లు. అవి మాత్రమే చిరస్థాయిగా నిలిచిపోతాయి.
శాస్త్రీయ సమాచారం అవసరం..
దేశవ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ సాధ్యమై తీరుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సర్వే డేటాను కోర్టుల్లో ప్రవేశపెట్టినప్పుడు, దానికి ప్రామాణికత, శాస్త్రీయ ఆధారాలేమిటి, ఎక్కడ నుంచి వివరాలు సేకరించారు అని కోర్టులు విచారిస్తాయి. అయితే న్యాయస్థానాల్లో నిలబడాలంటే డేటా శాస్త్రీయబ ద్ధం గా ఉండాలి. ఏ రాష్ట్ర ప్రభుత్వమైన ఒక డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి నిర్ణయాలు తీసుకోవాలి.
దానికి చట్టబద్ధత కల్పిస్తే అప్పుడు ఏ అంశమైన కోర్టుల్లో నిలుస్తుంది. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదనే సుప్రీం కోర్టు తీర్పు కారణంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. 2023లో బీహార్ ప్రభు త్వం చాలా సమగ్రమైన సర్వే నిర్వహించింది. రిజర్వేషన్ సీలింగ్ కారణంగా దాన్ని కూడా అక్కడి హైకోర్టు కొట్టేసింది. ప్రతి రాష్ట్రంలోనూ అక్కడి బీసీల ఆకాంక్షలకు అనుగుణంగా రిజర్వేషన్లను పెంచడంతోపాటు, రిజర్వేషన్‌పై ఉన్న 50 శాతం సీలింగ్‌ను తొలగిం చినట్టయితే దేశవ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ అమలు చేయడం సాధ్యమవుతుంది.
రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం..
ఎవరికైనా, ఏ సామాజికవర్గానికైనా రా జ్యాధికారమే అంతిమ లక్ష్యం. సమాజాన్ని పరిపాలించే అవకాశాన్ని రాజ్యాధికారం కల్పిస్తుంది. రాజ్యాధికారం కొన్ని సామాజికవర్గాలకే ఎందుకు పరిమితం కావాలి. ప్రస్తు తం మేధావులు, విద్యావేత్తలు, సమ సమా జం స్థాపించాలనుకునే వారు అన్ని సామాజికవర్గాల్లోనూ ఉన్నారు. అన్ని సామాజి కవర్గాలకు సమాన అవకాశాలు లభించడం లేదు. అందుకే కొన్ని కులాలే రాజ్యాధికారా న్ని అనుభవిస్తున్నాయి. ఈ పరిస్థితి నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉంది. రా జ్యాధికారాన్ని బీసీలే కాదు, ఎస్సీ, ఎస్టీలు, మహిళలు కూడా అనుభవించాలి. అందరికీ అవకాశాలు రావాలి. అగ్రకులాల్లోని ఇతరులకు, అర్హత ఉన్న వారికి కూడా అవకాశాలు లభించాలి.
పట్టించుకోని పార్టీలకు మద్దతు ప్రశ్నార్థకం..
బీసీలు, ఓబీసీల ఆకాంక్షలను అర్థం చేసుకోని పార్టీలకు భవిష్యత్‌లో బీసీల మద్దతు లభించడం ప్రశ్నార్థకంగా మారుతుంది. బీసీల సమస్యల పట్ల సమగ్రమైన ఆలోచన విధానంతో రాజకీయ పార్టీలన్నీ ముందుకెళ్లాలి. తాము ఉద్యమాలు చేస్తున్నా, రిజర్వేషన్ కోసం కొట్లాడుతున్నా పట్టించుకోవడం లేదని, తమకు న్యాయం చేయని పార్టీలకు మద్దతు ఇవ్వకూడదనే ఆలోచన బీసీల్లో అధికంగా పెరుగుతుంది. బీసీలకు అన్యాయం జరిగిందని మిగిలిన కులాల వారు కూడా భావిస్తున్నారు. ఈ క్రమంలో రాజకీయ పార్టీలన్నీ చర్చించి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచి రిజర్వేషన్లను అమలు చేయాల్సిన అవసరం ఉంది.
తెలంగాణ సర్వేలో శాస్త్రీయత ఎంత?
ఏ ప్రభుత్వాలు కులగణనను చేసినా స్వాగతించాలి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సోషియో ఎకనామిక్ సర్వేను పూర్తిగా స్వాగతిస్తున్నా. కానీ సర్వే ఎంత మేరకు శాస్త్రీయంగా నిర్వహించారనే అంశంపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. వాస్తవానికి తెలంగాణలో 52 శాతం ఉన్న బీసీల శాతం 46 శాతానికి పడిపోవడంతో డేటా ప్రామాణికతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం చేసిన సర్వేలో ఒడిదుడుకులు ఉన్న క్రమంలో వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అయితే జనగణనలో కులగణన శాస్త్రీయంగా జరగనున్న నేపథ్యంలో ఆ సర్వే డాటా అందరి ముందుకు వస్తుంది. దానితో మరింత స్పష్టత వస్తున్నందున ఆ డేటాను అందరూ ఉపయోగించుకోవాలి.
కొందరి చేతుల్లోనే రాజకీయ గుత్తాధిపత్యం..
జనగణనలో కులగణన చేయ డం ద్వారా బీసీల ముందుకు గొప్ప అవకాశం వచ్చింది. తద్వారా కులాలకు సంబంధించిన డేటాతోపాటు ఆర్థికపరమైన, సామాజిక పరమైన స్థితిగతులపై, విద్య, ఉపాధి, స్వయం ఉపాధి పరంగా బీసీల పొందుతున్న లబ్ధిని బయటపెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్రమైన, సం యుక్త ప్రయత్నాలు చేయాలి. బీసీ లు రాజకీయంగా వెనుకబడటానికి ప్రధానం కారణం ఆధిపత్య కులాలే. వారి గుత్తాధిపత్యంలోనే ఇప్పటికీ రాజకీయాలు కొనసాగుతున్నాయి. డబ్బు, పోల్ మేనేజ్‌మెంట్ వంటి వనరులను ఆధిపత్య కులాలు వారి గుప్పిట్లో పెట్టుకున్నాయి. కొన్ని సామాజికవర్గాలకు చెందిన వారే రాజకీయాల్లో ఆధిపత్యం చలాయిస్తున్నారు. బీసీల దగ్గర డబ్బు లేక పోవడం, వీరిలో సంఘటిత భా వం లేకపోవడం కూడా వెనుకబాటుకు కారణాలుగా చెప్పొచ్చు.
8 రాష్ట్రాల్లో రిజర్వేషన్ పెంపుపై నిర్ణయాలు..
ఏ క్షేత్రాల్లో బీసీలకు రిజర్వేషన్ ఇస్తున్నారనేది ముఖ్యం. ఇప్పటివరకు విద్య, ఉపాధి పరంగా కొంత వెసులుబాటు కలిగింది. కానీ రాజకీయంగా ప్రభావం చూపించాల్సిన చోట బీసీలకు రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు. దీంతోపాటు స్వయం ఉపాధి రంగంలోనూ బీసీలు అత్యధికంగా వెనుకబడి ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ అంశం ఏవిధంగా చర్చనీయాంశంగా ఉందో.. అనేక రాష్ట్రాల్లోనూ అదే తరహా పరిస్థితులున్నాయి.
గత పది సంవత్సరాల్లో సుమారు 8 రాష్ట్రాలు వివిధ రంగాల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నాయి. కానీ వాటిని వివిధ కోర్టులు కొట్టి వేయడమో, స్టే ఇవ్వడమో జరిగింది. వీటన్నింటినీ సమగ్రంగా పరిశీలిస్తే తమకు రావాల్సిన ప్రతిఫలాలు రాకపోవడంతో అన్యాయం జరుగుతుందని బీసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో బీసీల రిజర్వేషన్ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవడం లేదని వారు ఆత్మన్యూనత భావానికి గురవుతున్నారు. బీసీ రిజర్వేషన్‌పై కూలంకషంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది.