27-11-2025 10:09:07 PM
'రాజు వెడ్స్ రాంబాయి' విజయంతో హుస్నాబాద్‌లో సంబరాలు
హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రాంతానికి చెందిన నటుడు కనకం వెంకట్ నటించిన తాజా చిత్రం 'రాజు వెడ్స్ రాంబాయి' విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న సందర్భంగా, గురువారం స్థానిక కళాకారులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ ప్రాంతానికి చెందిన నటుడు వెండితెరపై విజయం సాధించడంతో హుస్నాబాద్‌లో సంబరాలు చేసుకున్నారు. వెంకట్ హుస్నాబాద్ లోని వెంకటేశ్వర థియేటర్కు రాగా, ఈ ప్రాంత కళాకారులు ఆయనను అభినందనలతో ముంచెత్తారు. శాలువాతో సన్మానించారు.
తనను ఇంతగా ఆదరించినందుకు నటుడు వెంకట్ స్థానిక కళాకారులకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన నటనకు ప్రేక్షకుల నుంచి వస్తున్న ప్రశంసలు మరింత మంది యువ కళాకారులకు స్ఫూర్తినిస్తాయని ఈ సందర్భంగా పలువురు కళాకారులు అభిప్రాయపడ్డారు. ఈ సన్మాన కార్యక్రమంలో కళాకారులు ముక్కెర సంపత్, తాడూరి సురేశ్, గడిపె సంపత్, కొమ్ముల సంపత్, అన్నబోయిన శ్రీనివాస్, కొలుగూరి అశోక్ తదితరులు పాల్గొన్నారు.