27-11-2025 10:11:59 PM
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్..
రామగుండం (విజయక్రాంతి): ఇటీవల హైదరాబాదులో జరిగిన మంత్రుల క్యాబినెట్ మీటింగ్ లో రామగుండంలో 8 వందల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ క్రమంలో పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గురువారం హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. ప్లాంటు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ వచ్చిన క్రమంలో రామగుండం ప్రజల పక్షాన సీఎంకు కృతజ్ఞతలు తెలియజేశారు. గత రెండేళ్ల నుంచి కోట్లాది రూపాయల నిధులతో రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఇదే క్రమంలో ప్లాంట్ ఏర్పాటుపై మొదటి నుంచి కృషి చేస్తున్న ఎమ్మెల్యే కల సాకారం కావడం పట్ల ఎమ్మెల్యేతో పాటు స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్లాంటు ఏర్పాటు వల్ల స్థానికంగా పారిశ్రామిక అభివృద్ధితో పాటు అర్హత కలిగిన యువతకు ఉపాధి అవకాశాలు దక్కుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇప్పటికే పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రామగుండంలో జెన్కో విద్యుత్ ప్లాంట్ స్థానంలో 8 మెగావాట్ల ప్లాంటు ఏర్పడితే ఈ ప్రాంత రూపురేఖలు మారుతాయని అన్నారు. స్థానికంగా వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి సీఎం మరిన్ని నిధులు మంజూరు చేయాలని కోరినట్లు పేర్కొన్నారు.